144 section at Group 3 Exam centers in Telangana | రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17, 18 తేదీలలో జరుగనున్న గ్రూప్-3 పరీక్ష కొరకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి కమిషన్ కార్యదర్శి, సభ్యులతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్.పి.లు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న గ్రూప్ 3 పరీక్షకు 5 లక్షల 30 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, ఇందులో భాగంగా 1 వేయి 401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని పరీక్ష కేంద్రాలలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారితో కలిసి హాజరయ్యారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
ఈ సందర్భంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షల కొరకు జిల్లాలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని, 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో 4 వేల 471 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు కల్పిస్తున్నామని, త్రాగునీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బంది నియామకం, పరీక్ష కేంద్రంలో నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు ఇతర అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు.
స్ట్రాంగ్ రూమ్ నుండి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు తరలింపు కొరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్ తప్ప వేరే ఎవరికీ మొబైల్ అనుమతి లేదని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కొరకు సమయానుసారంగా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారుల సమన్వయంతో అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల ప్రాంతీయ సమన్వయకర్త లక్ష్మీనరసింహ, సహాయ సమన్వయకర్త రాజేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.