Employees Suspended In Siddipet: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. ఈ మేరకు సిద్దిపేట (Siddipet) జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభల్లో పాల్గొనడం, వారి వెంట తిరగడం వంటివి చేయకూడదు. అయితే, ఈ నెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్ లో ఉపాధి హామీ, సెర్ఫ్ ఉద్యోగులతో మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు. ఇది బహిర్గతం కావడంతో వెంకట్రామిరెడ్డి, రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో కలెక్టర్ ఆ ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలు చేపట్టారు. సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను సీసీ టీవీ ఆధారంగా గుర్తించారు. మొత్తం 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయగా.. వారిలో 38 మంది సెర్ప్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు.


Also Read: Mlc Kavitha Letter: 'నా ప్రతిష్టను దెబ్బతీశారు, లిక్కర్ కేసులో నేను బాధితురాలిని' - ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ