యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటింది. అయితే ఇందులో ట్రయల్ యూజర్లు కూడా ఉన్నారు. దీంతో స్పాటిఫై సరసన చేరినట్లు గూగుల్ ప్రకటించింది. ఏడాది క్రితం ఈ సంఖ్య 50 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లుగా ఉంది. దీంతోపాటు స్పాటిఫై కలెక్షన్‌ను కూడా యూట్యూబ్ మ్యూజిక్ చేరుకుంది. ఇప్పుడు ఈ రెండిటి వద్ద చెరో 80 మిలియన్ల కలెక్షన్ ఉంది.
ఈ నెల ప్రారంభంలో అమెజాన్ మ్యూజిక్ 100 మిలియన్ల ట్రాక్‌ను దాటింది. దీంతో యాపిల్ మ్యూజిక్ తర్వాత ఈ మార్కును చేరుకున్న మ్యూజిక్ సర్వీస్‌గా నిలిచింది. రెండు మిలియన్ల నుంచి 100 మిలియన్లకు అమెజాన్ మ్యూజిక్ కలెక్షన్ చేరడం విశేషం..
"సెప్టెంబర్ 2022 నాటికి యూట్యూబ్ ట్రయల్‌లో ఉన్న వారితో సహా ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల మ్యూజిక్, ప్రీమియం సబ్‌స్క్రైబర్‌లను అధిగమించింది. గత సంవత్సరం ఈ సంఖ్య 50 మిలియన్ల వద్ద ఉండగా ఏకంగా 30 మిలియన్ల మంది ఒకే సంవత్సరంలో పెరిగారు." అని యూట్యూబ్ గ్లోబల్ హెడ్ ఆఫ్ మ్యూజిక్ లియర్ కోహెన్ ఒక ప్రకటనలో తెలిపారు.
YouTube గ్లోబల్ హెడ్ ఆఫ్ మ్యూజిక్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్ బేస్‌ను చేరుకోవడంలో మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు, స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో భాగస్వామ్యాలు సహాయపడ్డాయి.
"మేం పార్ట్‌నర్‌షిప్ పవర్‌ని అర్థం చేసుకున్నాము. YouTube Music, YouTube Premium ప్రారంభించినప్పటి నుండి, Samsung వంటి కంపెనీలు, సాఫ్ట్‌బ్యాంక్ (జపాన్), Vodafone (యూరోప్), LG U+ (కొరియా), Google సేవల వంటి క్యారియర్‌లతో భాగస్వామ్యాన్ని నిర్మించాము. ఈ 80 మిలియన్ల సబ్‌స్క్రైబర్ మైలురాయిని చేరుకోవడంలో మాకు సహాయపడడంలో ఈ భాగస్వాములు కీలకంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం సంగీత అనుభవాన్ని మెరుగుపరచడంలో మాకు సహాయం చేస్తూనే ఉంటారు." అని కోహెన్ జోడించారు.
ఆటో రెన్యువల్ లేకుండా ఒక నెల బేసిక్ YouTube ప్రీమియం ప్లాన్ భారతదేశంలో రూ.139గా ఉంది. అదే ఆటో రెన్యువల్ ఉంటే రూ.129 మాత్రమే. దీంతోపాటు ఒక నెల ఉచిత యాక్సెస్ కూడా లభించనుంది. సబ్‌స్క్రైబర్‌లు తమ YouTube ప్రీమియం సభ్యత్వాన్ని ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. త్రైమాసిక సబ్‌స్క్రిప్షన్ ఫీజు రూ.399, వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ.1,290గా ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?