AP Police Fact Check : కడపలోని యోగి వేమన యూనివర్శిటీలో .. యోగి వేమన విగ్రహాన్ని తొలగించి వైఎస్ విగ్రహం పెట్టారని వస్తున్న విమర్శలపై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగా స్పందించింది. అవన్నీ తప్పుడు కథనాలని.. మిస్ లీడింగ్ చేసే విధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. యోగి వేమన విగ్రహాన్ని ఎంతో గౌరవంగా తొలగించి.. అంత కంటే ఎక్కువ  గౌరవంగా యూనివర్శిటీ గేటు వద్ద ప్రతిష్టించారని తెలిపింది. గతంలో యోగి వేమన విగ్రహం రోడ్డు మధ్యలో ఉండేదని.. ఇప్పుడు యూనివర్శిటీ గేటు మధ్యలో పెట్టారన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఏపీ ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 



అలాగే యోగి వేమన విగ్రహాన్ని తొలగించిన చోట.. వైఎస్ విగ్రహం పెట్టారన్న వాదన కూడా కరెక్ట్ కాదని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ఆ విగ్రహం గతంలోనే యూనివర్శిటీలో ఉందన్నారు. అయితే అది మరో చోట ఉండేదని.. కానీ ఇప్పుడు యోగి వేమన విగ్రహం ఉన్న చోటకు మార్చారన్నారు. ఇది యూనివర్శిటీ అధికారులు తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. ఇదంతా బయాస్డ్ జర్నలిజమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగంఆరోపించింది. 


ఈ వివరణ అంతా... ఓ దినపత్రికలో వచ్చిన ఆర్టికల్‌ను పవన్ కల్యాణ్ రీట్వీట్ చేస్తూ విమర్శలు గుప్పించడంపై ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఇచ్చారు.  ఈ విగ్రహ వివాదంపై రాజకీయ దుమారం రేగింది. విపక్ష నేతలు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వాధినేతకు విగ్రహాలు పిచ్చి పట్టిందని విమర్శలు గుప్పించారు. యోగి వేమన విగ్రహాన్ని ఎక్కడ నుంచి తీసి వేశారో అక్కడే పెట్టాలని పలు పార్టీలు..ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తాము మరింత ఉన్నతమైన స్థానంలో పెట్టామని ప్రభుత్వం  చెబుతోంది. ఈ అంశంపై సామాన్య ప్రజల్లోనూ విస్తృతమైన చర్చ జరిగే అవకాశం ఉండటం.తో.. ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం వెంటనే స్పందించింది.  


మరో వైపు మీడియాలో వచ్చి వివాదాస్పదమైన తర్వాత ఆ విగ్రహాన్ని హడావుడికి గేటు వద్ద ఏర్పాటు చేశారని..  ఆ తర్వాత ఫోటోలు తీసి మీడియాకు విడుదల చేశారని విపక్షల నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఉన్న చోట నుంచి విగ్రహాన్ని మరో చోట పెట్టడం గౌరవం ఇవ్వడం ఎలా అవుతుందని... ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం వివరణ ఇచ్చినప్పటికీ ఈ వివాదం ఇలా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.