వీడియో కంటెంట్ దిగ్గజ యూట్యూబ్ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు పాటలు, వీడియోలో సెర్చ్ చేయాలంటే పాట లేదంటే వీడియో పేరు సెర్చ్ బార్ లో టైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అయితే, ఇకపై ఈజీగా పాటను పొందే ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం కొత్త ఫీచర్ ను రూపొందిస్తున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది.


ట్యూన్ హమ్ చేసి పాటను పట్టుకోండి!


యూట్యూబ్ టెస్టింగ్ దశలో ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు పాటను హమ్ చేయడం సెర్చ్ చేసే అవకాశం ఉంది.  ఇప్పటికే పలు స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఫోన్ లోని సమాచారాన్ని వాయిస్ ద్వారా వెతికే పద్దతి చాలా ఫోన్లలలో ఇప్పటికే ఉంది. ప్రస్తుతం అదే ఫీచర్ ను యూట్యూబ్ తీసుకురాబోతోంది.  ప్రస్తుతం ఈ ఫీచర్ పరీక్షలు జరుపుతున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది. “ప్రస్తుతం ప్లే అవుతున్న పాటను హమ్ చేయడం లేదంటే రికార్డ్ చేయడం ద్వారా యూట్యూబ్‌లో పాటను సెర్చ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగదశలో ఉంది. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది” అని యూట్యూబ్ వెల్లడించింది.  అయితే, ఈ ఫీచర్ యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.


యూట్యూబ్‌లో పాటను ఎలా సెర్చ్ చేయాలంటే?


మీరు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్ అయితేనే ఈ ఫీచర్ ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఫీచర్‌ తో   యూట్యూబ్ వాయిస్ సెర్చ్ నుంచి కొత్త సాంగ్ సెర్చ్ ఫీచర్‌కి టోగుల్ చేయవచ్చు. ఆ తర్వాత మీకు నచ్చిన పాటను గుర్తించేందుకు 3+ సెకన్ల పాటు సదరు పాటను హమ్ చేయాలి. వెంటనే మీరు కోరుకుంటున్న పాటను అందిస్తుంది. అంతేకాదు, YouTube మిమ్మల్ని సంబంధిత మ్యూజిక్ కంటెంట్, సదరు యూట్యూబ్ ఛానెల్ రూపొందించిన వీడియోలు, పాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.  ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ డివైజ్‌లలో యూట్యూబ్ చూసే కొద్ది శాతం మందికి ప్రస్తుతం ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్ తెలిపింది.


టిక్ టాక్ లా యూట్యూబ్ షార్ట్స్!


రీసెంట్ గా యూట్యూబ్ షార్ట్స్ మరింత ప్రజాదరణ పొందేందుకు యూట్యూబ్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.  యూట్యూబ్ షార్ట్స్ ను టిక్ టాక్ మాదిరిగా మార్చింది.  యూట్యూబ్ షార్ట్స్ ను చూడటంతో పాటు రూపొందించే ప్రక్రియకు సంబంధించిన ఫీచర్‌లను ప్రకటించింది. ఈ ఫీచర్లు ఇప్పటికే టిక్‌ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండటం విశేషం. మొదటి ఫీచర్‌ను కొల్లాబ్ అని పిలుస్తారు. ఇది టిక్‌ టాక్ డ్యూయెట్ ఫీచర్‌ మాదిరిగానే ఉంటుంది. వీడియో ప్లే అవుతున్నప్పుడు ఒరిజినల్ వీడియో పక్కన స్ప్లిట్-స్క్రీన్ ఫార్మాట్‌ లో వీడియోకు స్పందించేలా వినియోగదారులను అనుమతిస్తుంది. అటు వర్టికల్ వీడియోలను లైవ్ టెలికాస్ట్ చేస్తున్న సమయంలో మరో పక్కన వారి ఫాలోవర్స్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫీచర్ టిక్‌ టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఉంది. టిక్‌టాక్‌లోని లైవ్ ఫీచర్ లాగా, యూట్యూబ్ షార్ట్స్ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నప్పుడు తమ అభిమాన క్రియేటర్స్ కు డబ్బులు పంపించే అవకాశం కూడా కల్పిస్తోంది.


Read Also: ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ యాడ్‌ను క్లిక్ చేసిన మహిళ - లక్షల రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు? మీకూ ఇలా జరగొచ్చు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial