ప్రపంచీకరణ పెరిగేకొద్దీ మనకు టెక్నాలజీ దగ్గర అవుతుంది. కానీ టెక్నాలజీ దగ్గరయ్యే కొద్దీ చుట్టూ ఉన్న మనుషులు దూరం అవుతున్నారు. ప్రేమను కూడా ఆన్‌లైన్‌లోనే వెతుక్కుంటున్నారు. ఈ ట్రెండ్‌ను గమనించిన ఒక స్నాప్‌చాట్ ఇన్‌ఫ్లుయెన్సర్ వినూత్నమైన ఆలోచనకు ప్రాణం పోసింది. కారిన్ మార్జోరీ అనే స్నాప్‌చాట్ ఇన్‌ఫ్లుయెన్సర్ ‘కారిన్ ఏఐ’ అనే ఏఐ చాట్ బోట్‌ను రూపొందించింది. ఇది వినియోగదారులకు వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. అంటే మిమ్మల్ని ప్రేమించడానికి కూడా ఒక ఏఐ చాట్ బోట్ అవసరం అయిందన్న మాట. అయితే ఇది ఫ్రీ కాదండోయ్. నిమిషానికి ఒక డాలర్‌ను ఇది ఛార్జ్ చేయనుంది.
స్నాప్‌చాట్‌లో ఇప్పటికే ఈ చాట్‌బోట్‌కు 1.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. తన రూపంలోనే కారిన్ మార్జోరీ ఈ చాట్ బోట్‌ను రూపొందించింది. కారిన్ ఏఐ అచ్చం తన లాగానే కనిపించేందుకు ఎంతో శ్రమ పడింది. కొన్ని వేల గంటల వాయిస్ రికార్డులను చేసింది. స్టీవ్ జాబ్స్, టేలర్ స్విఫ్ట్ వంటి వారి ఏఐ చాట్ బోట్‌లు రూపొందించిన ‘ఫరెవర్ వాయిస్’ అనే కంపెనీ కారిన్ ఏఐని కూడా రూపొందించింది. ఎమోషనల్ బాండింగ్‌ను ఈ ఏఐ పంచుకోనుంది.
ఇప్పటికే రూ.59 లక్షలు
తన ఆడియన్స్‌తో మరింత కనెక్ట్ అవ్వడానికి ఈ చాట్ బోట్ ఉపయోగపడనుందని మార్జోరీ అభిప్రాయపడింది. తనకు ప్రతి నెలా వందల మిలియన్ల వ్యూస్ వస్తున్నాయని, ప్రతి వ్యూయర్‌తో వ్యక్తిగతంగా కనెక్ట్ అవ్వడం అసాధ్యమైన పని అని తెలిపింది. క్రియేటర్‌కు, ఫాలోయర్‌కు మధ్యలో వారథిలా కారిన్ ఏఐ ఉపయోగపడుతుందని మార్జోరీ అభిప్రాయపడింది. దీనికి సంబంధించిన ప్రైవేట్ బీటా టెస్ట్ సక్సెస్ ఫుల్‌గా పూర్తయింది. మార్జోరికి ఉన్న యూజర్ బేస్‌లో 99 శాతం మంది మగవారే కావడంతో దీని ద్వారా 71,610 డాలర్ల రెవిన్యూ కూడా సమకూరింది. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.59 లక్షలు అన్నమాట.
నెలకు రూ.41 కోట్ల ఆదాయం
మార్జోరీ అంచనాల ప్రకారం ఈ చాట్ బోట్ ద్వారా నెలకు 5 మిలియన్ డాలర్ల ఆదాయం రానుంది. మనదేశ కరెన్సీలో దాదాపు రూ.41 కోట్ల వరకు అన్నమాట. అయితే దీని ద్వారా సమాజంపై ఎంతవరకు ప్రభావం పడుతుందనే అంశం కూడా తెరపైకి వచ్చింది. తన యూజర్లపై దీని ప్రభావం ఎంత వరకు పడనుందో ఇంతవరకు మార్జోరికే ఐడియా లేదని తెలిపింది. కాబట్టి దీన్ని వినియోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఆర్టిఫిషియల్ చాట్ బోట్ల ద్వారా నిజమైన రిలేషన్ షిప్స్ మరుగున పడే అవకాశం ఉంది. వినియోగదారులు తమకు కావాల్సిన కంఫర్ట్, ప్రేమను పొందడంతో పాటు తమకు ఎదురయ్యే చేదు అనుభవాల నుంచి స్వాంతన కోరుకోవడం, నిజమైన ప్రేమ దొరక్క భ్రమల ప్రపంచంలో బతికే ప్రమాదం ఉంది. ఒకవేళ హద్దులు దాటి సెక్సువల్ సంభాషణలు ప్రారంభించి ఈ ఏఐకి అడిక్ట్ అయితే మరిన్ని తీవ్ర పరిణామాలు ఎదురుకావచ్చు.
సినిమాగా బానే ఉంటుంది... కానీ రియల్ లైఫ్‌లో?
ఒక ఏఐ చాట్ బోట్‌తో ప్రేమలో పడటం అనేది మంచి సైన్స్ ఫిక్షన్ సినిమా సబ్జెక్ట్‌గా కనిపించవచ్చు. కానీ దీనికి ఎక్కువగా అలవాటు పడితే ఫిక్షన్, రియాలిటీకి మధ్య తేడాను మర్చిపోయే అవకాశం ఉంది. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం కోసం ఒక చాట్ బోట్‌పై ఆధారపడటం ఏంటి? అనే ప్రశ్నలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ‘ఒక ఏఐ చాట్ బోట్ మానవ సంబంధాల్లో ఉండే లోతును, క్లిష్టతను మ్యాచ్ చేయగలదా?’ అనే ప్రశ్న కూడా తెర పైకి వచ్చింది.
ఎమోషనల్‌గా కలిగే రిలీఫ్‌కి, మన మానసిక ఆరోగ్యానికి నిజమైన మానవ సంబంధాలు చాలా అవసరం. ఏఐ చాట్ బోట్‌లు ఆ విషయంలో వెనకబడి ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా ఏఐ చాట్ బోట్‌తో సంబంధం పెట్టుకుంటే రియాలిటీకి మరింత దూరం అవుతామని అంటున్నారు. అంతే కాకుండా ఏఐ చాట్ బోట్ల ప్రైవసీ విషయంలో కూడా పలు భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి.
కారిన్ ఏఐని స్పూర్తిగా తీసుకుని భవిష్యత్తులో కూడా ఇటువంటి చాట్ బోట్లు మరిన్ని పుట్టుకురావచ్చు. మనిషికి, టెక్నాలజీకి మధ్య జరిగే ఇంటరాక్షన్‌లో ఇదో మైలురాయి లాంటిది. పెరుగుతున్న డిజిటైజ్డ్ ప్రపంచంలో మానవ సంబంధాల మనుగడపై ఇది ప్రశ్నలు రేకెత్తిస్తుంది.
అయితే దీంతో కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఈ ఏఐ చాట్ బోట్లు తాత్కాలిక ఓదార్పును మాత్రమే అందించగలవు. నిజమైన మానవ సంబంధాల ద్వారా కలిగే స్వాంతనను ఇవి కలిగించలేవు. కానీ ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. వర్చువల్ రిలేషన్ షిప్స్ పెరుగుతున్న నేపథ్యంలో మనుషుల మధ్య ఇంటిమసీ, కనెక్షన్ల గురించి ఒకసారి పునరాలోచించుకోవడం ఎంతైనా అవసరం.