ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. డేటా ప్రైవసీ విషయంలో ఇదివరకే ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ సంస్థపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వాట్సాప్ సంస్థ కొన్ని నెలల కిందట ప్రైవసీ పాలసీ వివాదాన్ని సైతం ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్ల డేటా భద్రత కోసం మరో కొత్త లేయర్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. చాటింగ్ డేటా బ్యాకప్ అప్‌డేట్ సెక్యూరిటీ విషయాన్ని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
వాట్సాప్ యూజర్లు ఛాటింగ్ వివరాలను గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ లలో బ్యాకప్ చేసుకునే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది. గతంలో కేవలం యూజర్ల వాట్సాప్ ఛాటింగ్ వివరాలను మాత్రమే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేసేవారు. అయితే యూజర్లు తమ ఛాటింగ్ డేటా కోసం ఇబ్బందులు ఎదుర్కొనేవారు. తాజాగా ఛాటింగ్ డేటాను ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానంలో బ్యాకప్ చేసుకునే అవకాశాల్ని అటు ఆండ్రాయిడ్ వినియోగదారులకు, ఇటు ఐఫోన్ యూజర్లకు అందించనుంది.
Also Read: 10 అంగుళాల డిస్ ప్లే, 7100 ఎంఏహెచ్ బ్యాటరీ.. ధర రూ.14 వేలలోపే.. రియల్ మీ సూపర్ ట్యాబ్లెట్!
మెసేజింగ్ యాప్‌లలో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానంలో మెస్సేజ్‌లు, ఛాటింగ్ డేటాను బ్యాకప్ చేస్తున్న తొలి సంస్థ వాట్సాప్ అని జుకర్ బర్గ్ వెల్లడించారు. ఇది చాలా కష్టతరమైన అంశమని, కొత్త ఫ్రేమ్‌వర్క్ విధానంలో పలు ఆపరేటింగ్ సిస్టమ్స్ సహాయంతో దీన్ని తమ టెక్నీషియన్లు సాధ్యం చేశారని తెలిపారు. యూజర్లు తమ డేటా ప్రైవసీ విషయంలో చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కొత్త ఫీచర్‌ను ఎలా అందుబాటులోకి తెచ్చామనే దానిపై శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. సందేహాలు ఉంటే అందులో చెక్ చేసుకోవాలని ఫేస్‌బుక్ సీఈవో సూచించారు.
Also Read: వన్‌ప్లస్ నుంచి రూ.20 వేల లోపు ధరలో స్మార్ట్ ఫోన్లు.. వచ్చే ఏడాది ఎంట్రీ..
బ్యాకప్ డేటా సేఫ్..
బ్యాకప్ చేసుకున్న ఛాటింగ్ డేటాను కేవలం ఆ యూజర్ మాత్రమే చూడగలడని సంస్థ చెబుతోంది. వాట్సాప్ సంస్థ సైతం యూజర్ల డేటా జోలికి వెళ్లడం కుదరదని పేర్కొన్నారు. 200 కోట్ల యూజర్లు రోజువారీగా పంపుకునే 100 కోట్ల మెస్సేజ్‌లకు ప్రైవసీ కల్పించడంలో భాగంగా ఫేస్ బుక్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. త్వరలో ఫీచర్ అందుబాటులోకి వచ్చాక.. యూజర్లు పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలని అప్పుడు ఛాటింగ్ డేటా ఎన్‌క్రిప్ట్ అవుతుందని సంస్థ ప్రకటించింది.