ఫేస్‌బుక్ తర్వాత దాని పేరెంట్ కంపెనీ మెటా ఇప్పుడు వాట్సాప్ కోసం పర్సనలైజ్డ్ 3డీ అవతార్‌లను అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ పేజీలో వాట్సాప్‌కు అవతార్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మెటా యాప్‌ ఫ్యామిలీలో మరిన్ని స్టైల్స్ రాబోతున్నాయని తెలిపారు. మెటా యాజమాన్యంలోని WhatsApp రెండు బిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులతో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా ఉంది.


"మేము వాట్సాప్‌కు అవతార్‌లను తీసుకువస్తున్నాము. ఇప్పుడు మీరు మీ అవతార్‌ను చాట్‌లలో స్టిక్కర్‌గా ఉపయోగించవచ్చు. మా అన్ని యాప్‌లలో మరిన్ని స్టైల్స్ త్వరలో వస్తాయి" అని జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ వాల్‌పై రాశారు.


అవతార్ అనేది వినియోగదారుడి డిజిటల్ వెర్షన్. దీన్ని విభిన్నమైన హెయిర్ స్టైల్స్, ముఖ లక్షణాలు, దుస్తులను కలపడం ద్వారా సృష్టించవచ్చు. WhatsAppలో వినియోగదారులు ఇప్పుడు వారి పర్సనలైజ్డ్ అవతార్‌ను వారి ప్రొఫైల్ ఫోటోగా ఉపయోగించవచ్చు. అనేక విభిన్న భావోద్వేగాలు, చర్యలను ప్రతిబింబించే 36 స్టిక్కర్‌లలో ఒకదాని నుండి ఎంచుకోవచ్చు.


"అవతార్‌ను పంపడం స్నేహితులు, కుటుంబ సభ్యులతో భావాలను పంచుకోవడానికి వేగవంతమైన, ఆహ్లాదకరమైన మార్గం. ఇది మీ నిజమైన ఫోటోను ఉపయోగించకుండా మరింత ప్రైవేట్‌గా అనిపిస్తుంది." అని WhatsApp తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.


"చాలా మంది వ్యక్తులకు, అవతార్‌ను సృష్టించడం ఇదే మొదటిసారి. మేము లైటింగ్, షేడింగ్, హెయిర్‌స్టైల్ అల్లికలు, మరిన్నింటితో సహా స్టైల్ అప్ డేట్ చేయడం కొనసాగిస్తాం. ఇవి అవతార్‌లను మరింత మెరుగ్గా చేస్తాయి." అని వాట్సాప్ పేర్కొంది.


వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటాలో 21 కొత్త ఎమోజీలను విడుదల చేయనుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.25.12 కోసం WhatsApp బీటా 21 కొత్త ఎమోజీలను కలిగి ఉంటుందని WhatsApp అప్‌డేట్ ట్రాకర్ WABetaInfo ఇటీవల తెలిపింది. రెండు డివైజ్‌లలో ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని వినియోగదారులకు అందించడం ద్వారా వాట్సాప్ చాలా ఎదురుచూస్తున్న ఫీచర్‌ను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం WhatsApp వినియోగదారులు ట్యాబ్లెట్ ద్వారా వారి అకౌంట్‌లో లాగిన్ అయితే, వారి ప్రైమరీ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతారు.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?