వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంలో వాట్సాప్ ముందుంటుంది. నూతన ఫీచర్లతో యూజర్లకు మరింత మెరుగైన చాటింగ్ అనుభవాన్ని కల్పిస్తోంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. ఫ్రైవసీకి పెద్ద పీట వేస్తూ 'చాట్​ లాక్​' ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్​తో వినియోగదారుల చాట్స్ కు మరింత భద్రత లభిస్తుందని మెటా అధినేత జుకర్ బర్డ్ వెల్లడించారు.  






చాట్ లాక్ ఫీచర్ విడుదల నేపథ్యంలో వాట్సాప్ కీలక విషయాలు వెల్లడించింది. “మీ మెసేజ్ లను  ప్రైవేట్‌గా, సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే చాట్ లాక్ పేరుతో కొత్త ఫీచర్ ను మీ ముందుకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాం. ఇది మీ అత్యంత సన్నిహిత మెసేజ్ లను ఇతరులకు కనిపించకుండా దాచి పెడుతుంది. చాట్‌ను లాక్ చేయడం వలన ఇన్‌బాక్స్ నుంచి సరికొత్త ఫోల్టర్ లో లాక్ చాట్స్ సేవ్ అవుతాయి. మీరు పాస్ వర్డ్ లేదంటే ఫింగర్ ప్రింట్ ఎంటర్ చేస్తేనే లాక్ చేసిన మెసేజ్ లను చూసే అవకాశం ఉంటుంది. మీ ఫోన్ ను ఇతరులు వాడిన సందర్భంగా ఆయా మెసేజ్ లు ఎవరూ చూడకుండా చాట్ లాక్ కాపాడుతుంది. త్వరలోనే ఈ ఫీచర్ ను పూర్తి అప్ డేషన్ తో మీ ముందుకు తీసుకురాబోతున్నాం” అని వాట్సాప్ వెల్లడించింది. 






వాట్సాప్​లో చాట్ లాక్ ను ఎలా ఉపయోగించాలి?


మనం ఏ చాట్ నైనా లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం లాక్ చేసిన వెంటనే ఇన్ బాక్స్ లో ఆ మెసేజ్ కనిపించదు. మరో ఫోల్డర్ లోకి వెళ్లిపోతుంది. ఆ ఫోల్డర్ ను పాస్ వర్డ్ లేదంటే ఫింగర్ ఫ్రింట్ తో మాత్రమే ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. లాక్ చేసిన చాట్ నుంచి ఏ మెసేజ్, లేదంటే నోటిఫికేషన్ వచ్చినా, ఆటోమేటిక్ గా హైడ్ అవుతుంది.  


వాట్సాప్ లో చాట్ ను ఎలా లాక్ చేయాలంటే?


1. ముందుగా మీ వాట్సాప్​ను అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.  


2. మీరు ఏ చాట్​ని లాక్​ చేయాలని భావిస్తున్నారో దాని ప్రొఫైల్​ పిక్చర్​ మీద క్లిక్ చేయాలి.


3. మీకు కొత్తగా  'చాట్​ లాక్​' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది డిసప్పియరింగ్​ మెసేజ్​ మెన్యూ కింద కనిపిస్తుంది.  


4. ఇప్పుడు చాట్ లాక్ ను ఎనేబుల్ చేయాలి. ఇందుకోసం మీరు పాస్ వర్డ్ లేదంటే ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి.  


5. వెంటనే చాట్ లాక్ అవుతుంది. లాక్​ చేసిన చాట్​ను చూడాలంటే మీ వాట్సాప్​ హోం పేజ్​ని కిందకి స్వైప్​ చేయాలి. మీ పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే చాట్ లాక్ కనిపిస్తుంది.


Read Also: నా నెత్తి మీద గన్ పెట్టినా మీ మెసేజ్‌లు చూడలేను - వాట్సాప్‌కు పోటీగా ట్విట్టర్‌ను తయారు చేస్తానంటున్న మస్క్!