టెక్నాలజీ ప్రపంచంలో రోజుకో కొత్త విషయం పుట్టుకొస్తుంది. అయితే వాటిని మనం వినియోగించే తీరుపై పరిణామాలు ఆధారపడి ఉంటాయి. VitalID అని పిలిచే ఒక కొత్త, వినూత్నమైన బయోమెట్రిక్ సిస్టమ్ కనిపెట్టారు. రట్జర్స్ యూనివర్సిటీ (Rutgers University) పరిశోధకులు ఈ బయోమెట్రిక్ టెక్నాలజీని ఆవిష్కరించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పాస్‌వర్డ్, పిన్ (PIN) లేదా ఫింగర్‌ప్రింట్ అవసరం లేకున్నా మీరు మీ అకౌంట్లలోకి లాగిన్ అవ్వొచ్చు. దానికి బదులుగా ఇది మీ శరీరంలో ఉత్పన్నమయ్యే ప్రకంపనలు (Vibrations) ఆధారంగా మీ ఐడెండిటీని గుర్తిస్తుంది.

Continues below advertisement

శరీర కదలికలతో మిమ్మల్ని గుర్తిస్తుంది మన శరీరం ఎప్పుడూ పూర్తిగా అలాగే ఉండదు. శ్వాసక్రియ , గుండె చప్పుడుతో శరీరంలో స్వల్ప కంపనాలు ఉత్పన్నమవుతాయి. ఇవి మెడ గుండా ప్రయాణించి తల వరకు చేరుకుంటాయి. ఈ కంపనాలు తలకు చేరుకున్నప్పుడు చాలా స్వల్పమైన కదలికలను కలిగిస్తాయి. ప్రతి వ్యక్తి తల ఆకృతి, మందం, ఎముకల సాంద్రత భిన్నంగా ఉంటాయి. దీనితో పాటు, ముఖ కండరాలు,  కొవ్వు కూడా ఈ కంపనాల నమూనాను ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రతి మనిషిలో ఈ ప్రకంపనలు ఒక ప్రత్యేకమైన నమూనాను ఏర్పరుస్తాయి. ఇది వారి గుర్తింపు (Identity)గా మారుతుంది.

ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?VitalIDని ఉపయోగించడానికి ఎలాంటి ప్రత్యేక కొత్త హార్డ్‌వేర్ అవసరం లేదు. ప్రస్తుతం వాడుకలో ఉన్న VR.. AR హెడ్‌సెట్‌లలో ఇప్పటికే ఉన్న మోషన్ సెన్సార్లు ఈ పనిని చేస్తాయి.  శ్వాస తీసుకోవడం, గుండె చప్పుడు ద్వారా ఉత్పన్నమయ్యే తలలోని అతి సూక్ష్మమైన కదలికలను ఈ సిస్టమ్ ఆ సెన్సార్ల సహాయంతో గుర్తిస్తుంది. ఆ తర్వాత, ఈ సాఫ్ట్‌వేర్ తల తిప్పడం లేదా నడవడం వంటి సాధారణ కదలికలను వేరు చేసి, కేవలం బయోలాజికల్ సిగ్నల్స్‌ను మాత్రమే గుర్తిస్తుంది. అనంతరం ఈ సిగ్నల్‌ను ముందుగా సేవ్ చేసిన ప్రొఫైల్‌తో మ్యాచ్ చేసి మీ గుర్తింపును నిర్ధారిస్తుంది.

Continues below advertisement

ఇది నిజంగా సురక్షితమేనా?ముఖం, వేలిముద్రలు లేదా కంటి స్కాన్ వంటి చాలా బయోమెట్రిక్ సిస్టమ్‌లను ఏదో ఒక విధంగా కాపీ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ తల కదలికలను కాపీ చేయడం చాలా కష్టమని భావిస్తున్నారు. ఎవరైనా మీ శ్వాస వేగాన్ని అనుకరించగలిగినప్పటికీ, మీ తల నిర్మాణం, అంతర్గత అమరికను ప్రతిబింబించేలా చేయడం దాదాపు అసాధ్యం. అందుకే ఈ సిస్టమ్ మరింత సురక్షితమైనదిగా భావిస్తున్నారు.

పనితీరు ఎలా ఉంది?ఒక పరిశోధనలో భాగంగా సుమారు 10 నెలల పాటు 52 మందిపై ఈ విటల్ ఐడీ టెక్నాలజీని పరీక్షించారు. ఇందులో ఈ సిస్టమ్ 95 శాతం కంటే ఎక్కువ సందర్భాల్లో సరైన వ్యక్తిని గుర్తించగలిగిందని, అలాగే అనధికారిక వ్యక్తులను గుర్తించడంలో 98 శాతానికి పైగా విజయం సాధించిందని తేలింది. ఈ టెక్నాలజీకి 2025లో ఒక ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక గుర్తింపు దక్కింది.

భవిష్యత్తులో లాగిన్ టెక్నాలజీ ఇదేVR, AR పరికరాలు బ్యాంకింగ్, హెల్త్ రికార్డులు, ఆఫీస్ సిస్టమ్స్‌ను యాక్సెస్ చేయడానికి మార్గాలుగా మారుతున్న కొద్దీ,  సేఫ్, ఈజీ లాగిన్ సిస్టమ్ అవసరం పెరుగుతోంది. VitalID ఈ దిశలో ఒక పెద్ద అడుగుగా చెప్పవచ్చు. ఇందులో వినియోగదారుడు చేయాల్సిందేమీ లేదు. కేవలం హెడ్‌సెట్ ధరించగానే, మీరు అసలైన వినియోగదారులా కాదా అని సిస్టమ్ గుర్తిస్తుంది.