మీరు మరణించిన యాపిల్, గూగుల్ వంటి క్లౌడ్ సర్వీసుల్లో సేవ్ చేయబడిన మీ డేటా మొత్తం ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ ఆలోచన కూడా వచ్చి ఉండదు కదా.. అయితే, గూగుల్ మాత్రం దీని గురించి ఆలోచించింది. మీ అకౌంట్‌ను ఎప్పుడు ఇన్‌యాక్టివ్‌‌గా పరిగణించాలో, ఆ తర్వాత మా డేటాకు ఏం జరగాలో నిర్ణయించే ఒక ఫీచర్ ఉంది. మీరు గూగుల్ మ్యాప్స్, జీమెయిల్, గూగుల్ సెర్చ్ లేదా గూగుల్ ఫోటోస్ వంటి గూగుల్ సర్వీసులను ఉపయోగిస్తున్నా, లేదా కనీసం ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగిస్తున్నా చాలు. మీ గురించి లేదా మీ అలవాట్ల గురించి గూగుల్‌లో చాలా డేటా ఉంటుంది. కొందరు వ్యక్తులు తమ బ్యాంక్ కార్డ్ వివరాలను, గూగుల్ పే వంటి యాప్‌లను కూడా పేమెంట్ చేయడానికి సేవ్ చేస్తారు. మీ గూగుల్ ఖాతాలో ఉన్న ఈ సున్నితమైన సమాచారం కోసం ఒక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీ తర్వాత ఈ డేటాను జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరో ఒకళ్లు ఉండాలిగా మరి!


ఇప్పుడు, ఒక వ్యక్తి తన గూగుల్ ఖాతాను నెలల తరబడి ఉపయోగించనప్పుడు, ఆ అకౌంట్ ఇన్‌యాక్టివ్‌గా మారుతుంది. మీ గూగుల్ ఖాతాలో ఏ యాక్టివిటీ లేదని గూగుల్ గుర్తించనప్పుడు, అది ఇన్‌యాక్టివ్ అవుతుంది. అయితే మీ గూగుల్ అకౌంట్‌ను ఎప్పుడు ఇన్‌యాక్టివ్‌గా పరిగణించాలి, ఆ తర్వాత మీ అకౌంట్‌కు ఏం జరగాలో నిర్ణయించేందుకు గూగుల్ ఇప్పుడు మిమ్మల్ని అనుమతిస్తుంది. మీ గూగుల్ అకౌంట్, అందులోని డేటాను మీరు నమ్మే వ్యక్తితో షేర్ చేసుకునే అవకాశాన్ని గూగుల్ తన వినియోగదారులకు అందిస్తుంది. లేదా అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయితే దాన్ని డిలీట్ చేయమని కూడా వారు గూగుల్‌ని అడగవచ్చు. "మీరు కొంతకాలం మీ గూగుల్ ఖాతాను ఉపయోగించకపోతే మీరు సెట్అప్ చేసిన ప్లాన్‌ను మాత్రమే మేము ట్రిగ్గర్ చేస్తాము. మేం అలా చేయడానికి ముందు ఎంతకాలం వెయిట్ చేయాలో మాకు చెప్పండి "అని గూగుల్ చెప్పింది.


అకౌంట్ ఎంతకాలం ఉపయోగించకపోతే ఇన్‌యాక్టివ్‌గా పరిగణించాలో కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. అదే ఇందులో మంచి విషయం. దీనికి వినియోగదారులు గరిష్టంగా 18 నెలల వరకు కాల వ్యవధిని ఎంచుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకుని ఉపయోగించడానికి myaccount.google.com/inactive పై క్లిక్ చేయాలి. మీరు ఎంతగానో నమ్మే వ్యక్తులకు మాత్రమే పాస్‌వర్డ్ షేరింగ్‌ ఆథెంటికేషన్ ఇవ్వండి.


మీ గూగుల్ ఖాతా ఇన్‌యాక్టివ్ అయినప్పుడు లేదా మీరు ఇకపై ఖాతాను ఉపయోగించలేనప్పుడు ఆ విషయాన్ని తెలియజేయడానికి మీరు 10 మంది వరకు ఎంచుకోవచ్చు. ఆ అవకాశాన్ని గూగుల్ మీకు ఇస్తుంది. యూజర్లు తమ డేటాలో కొంతభాగానికి యాక్సెస్ ఇవ్వవచ్చు, డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వవచ్చు. దీని కోసం విశ్వసనీయ ఈమెయిల్ ID అవసరం.


మీ గూగుల్ ఖాతా డేటాను ఎవరూ యాక్సెస్ చేయకూడదనుకుంటే, మీరు ఎవరి ఈమెయిల్ ఐడీని అందించాల్సిన అవసరం లేదు. అయితే, ఆ తర్వాత మీ డేటాను గూగుల్ డిలీట్ చేస్తుంది. మీ అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయ్యాక దాన్ని ఎవరూ రీస్టోర్ చేయలేరు.


మీరు విశ్వసనీయ ఇమెయిల్‌ని జోడించినప్పుడు, గూగుల్ మీకు ఒక లిస్ట్‌ను చూపిస్తుంది. అలాగే మీ కాంటాక్ట్‌తో మీరు ఏ డేటాను షేర్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోమని అడుగుతుంది. జాబితాలో గూగుల్ పే, గూగుల్ ఫోటోస్, గూగుల్ చాట్, లొకేషన్ హిస్టరీ, ఒక యూజర్ తమ గూగుల్ అకౌంట్ ఉపయోగించి చేసిన యాక్టివిటీస్ అన్నీ అక్కడ ఉంటాయి. మీ గూగుల్ ఖాతా ఇన్‌యాక్టివ్ అయ్యాక మీరు ఎంచుకున్న కాంటాక్ట్ కేవలం మూడు నెలలు మాత్రమే యాక్సెస్‌ను కలిగి ఉంటుందని గమనించడం ముఖ్యం. సెటప్ సమయంలో మీరు వ్రాసిన సబ్జెక్ట్ లైన్, కంటెంట్‌తో గూగుల్ మీరు ఎంచుకున్న కాంటాక్ట్‌కు ఈమెయిల్ పంపుతుంది. మీరు ఆ అకౌంట్‌ని ఉపయోగించడం నిలిపివేసిన తర్వాత మీ తరపున ఈమెయిల్ పంపమని వివరిస్తూ, ఆ ఈమెయిల్‌కు ఫుటర్‌ను జోడిస్తామని గూగుల్ చెబుతోంది.


ఒకవేళ మీ అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయ్యాక మీ మొత్తం డేటాను తొలగించాలని ఎంచుకుంటే, గూగుల్ మీ అకౌంట్‌లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అవుతుంది. ఇందులో YouTube వీడియోలు, లొకేషన్ హిస్టరీ, సెర్చ్ హిస్టర్, గూగుల్ పే డేటా, ఇతర కంటెంట్ ఉంటాయి. మీరు ఒక కాంటాక్ట్‌ను ఎంచుకుంటే, ఈమెయిల్‌లో మీరు వారితో ఏ డేటా పంచుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది.


Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి