Reliance Jio : దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో రోజుకో కొత్త ఆఫర్, వోచర్స్‌తో యూజర్స్‌ను ఆకర్షిస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా మరో కొత్త ఆసక్తికరమైన డీల్‌తో ముందుకొచ్చింది. జియో 5జీ వోచర్‌తో ఇప్పటికే ఆకట్టుకోగా.. ఇప్పుడు కేవలం రూ.601 వోచర్‌తో ఏడాది పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ప్రకటించింది. ఇది రూ.299 ప్లాన్, అంతకంటే ఎక్కువ ఖరీదు గల ప్లాన్స్ పొందిన వారి కోసం రూపొందించింది. ఇది కస్టమర్లు అంతరాయం లేని హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను ఆస్వాదించడానికి సరసమైన మార్గాన్ని అందిస్తోంది. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న క్రమంలో తమ నెట్‌వర్క్ వీడుతున్న యూజర్ల దృష్టిని మరల్చేందుకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది.


జియో రూ.601 5జీ డీల్ - పూర్తి వివరాలు


సాధారణంగా 1.5 జీబీ రోజువారీ డేటాను అందించే రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న యూజర్లు తమ ప్లాన్ ను రూ. 601 వోచర్‌తో అప్ గ్రేడ్ చేయవచ్చు. ఇది సంవత్సర కాలం పాటు 5జీ డేటాను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం 4జీ యూజర్లు సైతం ఈ వోచర్ ను ఉపయోగించుకోవచ్చు. మొదట జియో 5జీ సేవలు ప్రారంభించినప్పుడు 5జీ స్మార్ట్ ఫోన్, నెట్‌వర్క్ ఉన్న వారందరికీ వెల్‌కమ్ ఆఫర్ ద్వారా ఫ్రీగా 5జీ డేటా అందించింది. రూ.239 అంతకంటే ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేసిన వారందరికీ ఈ 5జీ డేటా అన్‌లిమిటెడ్‌గా ఇచ్చింది. కానీ, ఈ ఏడాది 2024, జులై నెలలో రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరించింది. ఆ తర్వాత అపరిమిత 5జీ డేటు ఇచ్చేందుకు పరిమితులు విధించింది. రోజుకు 2 జీబీ డేటా అందించే ప్లాన్ రీఛార్జ్ చేసిన వారికి మాత్రమే ట్రూ 5జీ ఉచిత డేటాను అందిస్తోంది. 


ఈ డీల్‌ను ఎలా యాక్టివేట్ చేయాలంటే..


రూ.601 డీల్‌ను మై జియో యాప్‌ లేదా జియో అధికారిక వెబ్‌సైట్‌లోనూ యాక్టివేట్ చేసుకోవచ్చు. అంతే కాదు రూ. 299 ప్లాన్ లేదా అంతకంటే ఎక్కువ విలువ గల ప్లాన్స్ కలిగిన తమ స్నేహితులకూ ఈ వోచర్‌ను గిఫ్ట్ మాదిరిగా అందించవచ్చని జియో తెలిపింది. అంటే మై జియో యాప్ ద్వారా మీరు నేరుగా ఈ వోచర్ ను యాక్సెస్ చేసి వేరే యూజర్లకు గిఫ్ట్ గా పంపవచ్చన్నమాట. కానీ దీనికో రూల్ ఉంది. మీరు ఎవరికైతే గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో.. వారు 1.5జీబీ లేదా అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్ లను కలిగి ఉండాలి. ఇక జియో రూ.601 వోచర్ తో పాటు చిన్న చిన్న 5జీ అప్ గ్రేడ్ ప్లాన్స్ ను కూడా అందిస్తోంది. అందులో రూ.51, రూ.101, రూ.151 వంటి బూస్టర్ ప్యాక్స్ ఉన్నాయి. ఇవి 4జీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ 5జీ యాక్సెస్ ను కూడా అందిస్తాయి. ప్రస్తుతం టెలికాం రంగంలో పోటీ ధరల నేపథ్యంలో జియో ఈ కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది.


Also Read : New Year Offers: కొత్త సంవత్సరంలో ఛీప్‌ అండ్‌ బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ - ఎయిర్‌టెల్‌, జియో న్యూ ఇయర్‌ ఆఫర్లు