Twitter Rate Limit: ఇప్పటి వరకు ట్విట్టర్ పూర్తిగా ఓపెన్ ప్లాట్‌ఫారమ్‌గా ఉండేది. అంటే ట్విట్టర్‌లో ఖాతా లేని వ్యక్తులు కూడా షేర్ చేసిన ట్వీట్‌లను చూడవచ్చు. దీని కోసం వారికి లాగిన్ లేదా అకౌంట్ అవసరం లేదు. అయితే ఇప్పుడు ఎలాన్ మస్క్ దానిని పూర్తిగా మార్చేశాడు. ట్విట్టర్ వాడకానికి కేటగిరీల వారీగా పరిమితిని విధించారు. డబ్బు చెల్లించి బ్లూ సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేసే వ్యక్తులు ఒక రోజులో 10 వేల ట్వీట్‌లను చదవగలరు. ఉచిత వినియోగదారులు కొన్ని ట్వీట్‌లను మాత్రమే యాక్సెస్ చేయగలరు. కొత్త ప్లాట్‌ఫారమ్‌లకు వచ్చిన వారికి కంపెనీ పరిమితిని నిర్ణయించింది.
ఎవరు ఎన్ని ట్వీట్లు చదవగలరు?
ఎలాన్ మస్క్ మొట్టమొదటగా శనివారం రాత్రి ట్వీట్ చేశాడు. బ్లూ టిక్ వినియోగదారులు ఒక రోజులో 6000 పోస్ట్‌లను చదవగలరు. అదేవిధంగా అన్ వెరిఫైడ్ అకౌంట్ ఉన్న వారు 600, 30 రోజుల లోపు అకౌంట్ ఓపెన్ చేసిన యూజర్లు కేవలం 300 పోస్ట్‌లను మాత్రమే చదవగలరు. ఈ లిమిట్ ట్విట్టర్‌లో ఖాతా కలిగి ఉన్న వ్యక్తుల కోసం మాత్రమే. ట్విట్టర్‌లో అకౌంట్ లేని వ్యక్తులు ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన దేనినీ యాక్సెస్ చేయలేరు.
ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే బ్లూ టిక్ వినియోగదారులకు పోస్ట్ రీడింగ్ పరిమితిని త్వరలో ఎనిమిది వేలకు, ధృవీకరించని ఖాతాలకు 800కు, కొత్త ఖాతాలకు 400కి పెంచనున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు.
లాస్ట్‌లో లిమిట్ మళ్లీ ఛేంజ్!
ఎలాన్ మస్క్ కొన్ని గంటల తర్వాత మరో ట్వీట్ చేశాడు. ఇప్పుడు బ్లూ టిక్ వినియోగదారులు ఒక రోజులో 10,000 పోస్ట్‌లను చదవగలరని, అన్‌వెరిఫైడ్ అకౌంట్లు 1,000 పోస్టులు, కొత్త అకౌంట్లు ఉన్న యూజర్లు ఒక రోజులో 500 పోస్ట్‌లను చదవగలరని చెప్పారు. యూజర్ లిమిట్‌ని దాటితే అతను ట్విట్టర్‌కు సంబంధించిన ఏ కంటెంట్‌ను చూడలేరు. అయితే దీనిపై యూజర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.