Podharillu Serial Today Episode: మాధవ్‌ పెళ్లిచూపులు గురించి మహాతోపాటు ఇంట్లో అందరూ మాట్లాడుకుంటారు. ఆడపెళ్లివాళ్లతో ఎవరు మాట్లాడాలని డిస్కషన్ చేస్తారు. నారాయణను పిలిచి ఎలా మాట్లాడాలో కూడా రిహార‌్సల్‌ చేస్తుంటారు. ఇంతలో మాధవ్‌ అక్కడికి రావడం చూసి అందరూ కంగారుపడతారు. ఏంటి అంతా కలిసి ఏదో చేస్తున్నారని మాధవ్ నిలదీస్తాడు. నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అంటూ అందరూ తప్పించుకుని మహాను ముందుకు తోస్తారు. దీంతో మహాలక్ష్మీ ఇవాళ మీకు పెళ్లిచూపులు అని చెప్పగా....మాధవ్‌ కోప్పడతాడు.
 
ఈ ఇంట్లో కోప్పడితే నేను కదా కోప్పడాలి...కానీ ఈమధ్య నేను వీక్‌ అయ్యేసరికి అందరూ నామీద కోప్పడుతున్నారు. అని గట్టిగా అరుస్తుంది. ఈరోజు మీకు పెళ్లిచూపులు సాయంత్రం అందరం కలిసి వెళ్తున్నాం. ఇది ఫిక్స్‌ ఇందులో ఎలాంటి మార్పులు లేవని గట్టిగా చెబుతుంది.. దీంతో పెద్ది కూడా నోరు మెదపలేకపోతాడు. అలాగేనని చెప్పి వెళ్లిపోతాడు. పెళ్లిచూపులకు వెళ్లేందుకు నారాయణ పూలరంగడులా తయారవుతాడు
 
చక్రితోపాటు కేశవ్‌, కన్నాకూడా రెడీ అయి వస్తారు. మహాలక్ష్మీ నిజంగా మాహాలక్ష్మీలా తయారై వస్తుంది. చివరకు మాధవ్‌ కూడా తమ్ముళ్లు కొనితెచ్చిన కొత్త చొక్కా వేసుకుని పెళ్లిచూపులకు సిద్ధమవుతాడు. మహాలక్ష్మీని చూసి ఇంట్లో అందరూ చాలా ముచ్చటపడతారు.ఎప్పుడు పెళ్లిచూపులకు వెళ్లినా మేం మాత్రమే వెళ్తుంటామని....అందరూ మీ ఇంట్లో ఆడవాళ్లు వెనక కారులో వస్తున్నారా అని అడిగేవాళ్లని ఇప్పుడు మాకు ఆ ఇబ్బంది లేదని కన్నా అంటాడు. అందరూ కలిసి సంతోషంగా  పెళ్లిచూపులకు బయలుదేరతాడు. మార్గమధ్యలో కేశవ్‌, కన్నా కలిసి చక్రిని ఏడిపిస్తుంటారు. దీంతో పూల దుకాణం వద్ద ఆగి చక్రి తన భార్యకు మల్లెపూలు కొని తెచ్చి ఇస్తాడు. అ విధంగా ఆడుతూపాడుతూ అందరూ కలిసి ఆడపెళ్లివాళ్ల ఇంటికి వెళ్తారు.
అమ్మాయి తండ్రి చాలా మోడ్రన్‌గా  ఆలోచిస్తుంటాడు. పాతకాలం నాటి పద్ధతులు వద్దని ఇప్పుడు అంతా ట్రెండీగా ఉండాలని అంటుంటాడు.అదేవిధంగా మగపెళ్లివారితో జోకులు వేసుకుంటూ సరదాగా గడుపుతాడు. ఇంతలో మహాలక్ష్మీ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పడంతో పెళ్లి కుమార్తె జ్యోతి వస్తుంది. ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకున్న తర్వాత....నీకు ఏమైనా మాట్లాడాలని అనిపిస్తే పక్కకు వెళ్లి మాట్లాడుకోమని పెళ్లికుమార్తె తండ్రి చెబుతాడు. దీంతో అమ్మాయి లేచి వెళ్తామని అడిగినా...మాధవ్ మాత్రం సిగ్గుపడుతూ అక్కడే కూర్చుంటాడు. దీంతో మహాలక్ష్మీ వచ్చి మా పరువుతీయకుండా వెళ్లి మాట్లాడి రమ్మని పంపిస్తుంది. బయటకు వెళ్లిన తర్వాత కూడా  మాధవ్‌ కొంచెం బిడియంగా ఉన్నా  పెళ్లికుమార్తె మాత్రం గళగళా మాట్లాడుతుంది. ఇద్దరూ అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత...లోపలికి వస్తారు.  ఒకరినొకరు నచ్చితే  పెళ్లి ఫిక్స్ చేసుకుందామని నారాయణ అంటాడు. ఇంతలో పెళ్లికుమార్తె తండ్రి అడ్డుపడి...అప్పుడే అలా ఒక నిర్ణయానికి రాలేమని ఇద్దరూ కొన్నాళ్లు మాట్లాడుకుని ఒకరి అభిప్రాయాలు ఒకరు నచ్చితే అప్పుడు పెళ్లికి వెళ్తామని అంటాడు.దీంతో మాధవ్‌,జ్యోతి ఫోన్ నెంబర్లు మార్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు.
 
ఇంటికి వెళ్లిన తర్వాత మహాకు వాళ్ల వదిన నిహారిక ఫోన్ చేస్తుంది. ఇవాళ మా పెద్ది పెళ్లిచూపులకు వెళ్లామని మహా చెప్పగా....మా అంటున్నావేంటి మహా అని నిహారిక నిలదీస్తుంది.నువ్వు కూడా ఆ ఇంట్లో ఒకదానిలా మారిపోయావా అని అడుగుతుంది. అయినా వాళ్లు ఎటుపోతే నీకు ఎందుకు నువ్వు అక్కడి నుంచి బయటకు రా అని చెబుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదరించిన వాళ్లను అలా మధ్యలో వదిలేసి రాలేనని మహా అంటుంది. నేను ఈ ఇంట్లో నుంచి బయటకు రావాలంటే ఖచ్చితంగా ఈ ఇంట్లోకి మరో అమ్మాయి వచ్చిన తర్వాతేనని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుండగా....పెళ్లి కూతురు దగ్గర నుంచి ఫోన్ రావడంతో మాధవ్‌ బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడతాడు.