భారత మార్కెట్‌లోకి సరికొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ అవబోతుంది. ప్రముఖ వాచ్ కంపెనీ టైమెక్స్ నూతన స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. టైమెక్స్ హెలిక్స్ స్మార్ట్ 2.0 పేరిట ఇది భారత మార్కెట్‌లోకి రానుంది. టెంపరేచర్, హార్ట్ రేట్‌లను పసిగట్టే సెన్సార్లు దీని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. దీని ధర రూ.3,999గా ఉంది. బ్లాక్, బ్లాక్ మెష్, గ్రీన్, రోజ్ గోల్డ్ మెష్, వైట్ వంటి ఐదు రంగులలో ఇది లభిస్తుంది. 
ప్రత్యేకతలివే.. 
టైమెక్స్ హెలిక్స్ స్టార్ట్ 2.0 టచ్ స్క్రీన్ 1.55 అంగుళాలు ఉంటుంది. దీర్ఘచతురస్రం ఆకారంలో ఉండే దీని స్క్రీన్‌కు కుడి వైపున ఉండే బటన్ ద్వారా దీనిని ఆపరేట్ చేయవచ్చు. హెలిక్స్ స్మార్ట్‌వాచ్‌లో చార్జింగ్ ఫుల్ అవడానికి మూడు గంటల సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది. ఒక్కసారి ఛార్జ్ చేశాక చేతికి ధరించి ఉంచితే 9 రోజుల వరకు, స్టాండ్‌బైలో ఉంచితే 15 రోజుల వరకు ఛార్జ్ ఉంటుందని తెలిపింది. 




టైమెక్స్ హెలిక్స్ స్మార్ట్ 2.0 లో ట్రెడ్‌మిల్, బాస్కెట్‌బాల్, యోగా, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, స్కిప్పింగ్‌ సహా 10కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. IP68 రేటింగ్‌ను కలిగి ఉండటం దీని ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఇది నీరు, దుమ్ముల నిరోధకత (రెసిస్టెంట్) ను కలిగి ఉంది. 
వినియోగదారులు తమ డేటాను గూగుల్ ఫిట్ మరియు ఆపిల్ హెల్త్‌లతో జత చేయవచ్చు. అలాగే దీని ద్వారా ఎన్ని మెట్లు ఎక్కాము, ఎన్ని కేలరీలను కరిగించాము అనే వివరాలను సైతం ట్రాక్ చేయవచ్చు. యాప్స్ మరియు ఈమెయిల్ నోటిఫికేషన్లను సైతం ఇది తెలియజేస్తుంది. 




ప్రస్తుతానికి అమెజాన్ వెబ్‌సైట్‌లో మాత్రమే ఇవి లభ్యమవుతున్నట్లు తెలుస్తోంది. జూలై 26 మరియు జూలై 27 తేదీల్లో జరగనున్న అమెజాన్ ప్రైమ్ డే అమ్మకం సందర్భంగా వీటిని అందుబాటులో ఉంచుతారు. దీనిని కొనుగోలు చేసిన వారికి కాంప్లిమెంటరీగా ఒక నెల పాటు DocOnline ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. 
త్వరలో Real Me స్మార్ట్ వాచ్..




ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ (Real Me) నుంచి త్వరలో సరికొత్త స్మార్ట్ వాచ్ రానుంది. రియల్ మీ వాచ్ 2 ప్రో (Realme Watch 2 Pro) పేరుతో భారత మార్కెట్లోకి స్మార్ట్ వాచ్ తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది.  దీనికి సంబంధించిన వీడియో టీజర్‌ను పోస్ట్ చేసింది. ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఈ వాచ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఎప్పుడు విడుదల చేస్తారనే తేదీని మాత్రం సంస్థ ప్రకటించలేదు. ఇప్పటికే ఈ వాచ్‌ను మలేషియాలో లాంచ్ చేయగా భారతదేశంలో ఇంకా విడుదల చేయలేదు. 390 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న ఈ వాచ్ ధర రూ.5300గా ఉండనున్నట్లు తెలుస్తోంది.