యాపిల్ తన డబ్ల్యూడబ్లూడీసీ 2023 ఈవెంట్లో ఐవోఎస్ 17 అప్‌డేట్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అప్‌డేట్‌ను ప్రస్తుతం వినియోగంలో ఉన్న కొన్ని ఐఫోన్లకు అందించబోవడం లేదు. యాపిల్ కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేసినప్పుడు కొన్ని పాత మోడల్స్‌కు నిలిపివేయడం సాధారణమే అయినా... ఈసారి ఇందులో ప్రీమియం ఫోన్లు కూడా ఉండటం విశేషం.
ఈ ఐఫోన్లకు నో అప్‌డేట్
ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ X... ఈ మూడు ఫోన్లూ ప్రస్తుతం ఐవోఎస్ 16 మీద పని చేస్తున్నాయి. వీటికి ఐవోఎస్ 17 అప్‌డేట్‌ను అందించబోవడం లేదని కంపెనీ తన అధికారిక సైట్లో ప్రకటించింది. ఈ ఐవోఎస్ 17 ప్రస్తుతం డెవలపర్ బీటా విడుదల అయింది. సెప్టెంబర్ తర్వాత స్టేబుల్ అప్‌డేట్ రానుంది.
వీటిలో ఐఫోన్ X యాపిల్ ఫేస్ ఐడీ 3డీ ఆథెంటికేషన్ టెక్నాలజీతో లాంచ్ అయిన మొదటి ఫోన్. అంచులు లేసి స్క్రీన్ కోసం యాపిల్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్‌తో రూపొందించిన మొట్టమొదటి ఐఫోన్ మోడల్ కూడా ఇదే.
ఇక యాపిల్ టచ్ ఐడీ ఆథెంటికేషన్‌తో లాంచ్ అయిన చివరి ప్రీమియం ఫోన్లు ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్. కొన్ని ఐప్యాడ్ మోడళ్లు, మ్యాక్ బుక్‌ల్లో యాపిల్ ఇప్పటికీ ఈ టెక్నాలజీనే ఉపయోగిస్తుంది. ఐఫోన్ ఎస్ఈ మోడళ్లలో కూడా టచ్ ఐడీనే ఉన్నప్పటికీ ఇవి ఐఫోన్ 8 సిరీస్ అంత ప్రీమియం మోడళ్లు కాదు.
ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 11 సిరీస్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎస్ఈ (2020), ఐఫోన్ ఎస్ఈ (2022) స్మార్ట్ ఫోన్లకు ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంది.
ఐవోఎస్ 17లో చాలా ఇంట్రస్టింగ్ ఫీచర్లు ఉన్నాయి. కొత్త ఆపరేటింగ్ సిస్టంతో వినియోగదారులు తమ ఫోటోలనే స్టిక్కర్‌లుగా ఉపయోగించవచ్చు. ఇది కాకుండా దాని కీప్యాడ్‌ను కూడా మాడిఫై చేశారు. దీని కారణంగా యాపిల్ డివైసెస్‌లో టైప్ చేయడం మరింత సులభం అవుతుంది.
ఈ కొత్త అప్‌డేట్‌తో నేమ్ డ్రాప్ ఫీచర్, ఫేస్‌టైమ్ వీడియో మెసేజ్ ఫీచర్లు అందించారు. దీంతోపాటు అన్నిటికన్నా ముఖ్యమైన స్టాండ్‌బై మోడ్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్టాండ్ బై మోడ్ ద్వారా ఐఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు లాక్ స్క్రీన్ హారిజంటల్‌గా మారుతుంది. ఇది ఐఫోన్‌ను స్మార్ట్ డిస్‌ప్లేగా మారుస్తుంది. దీనిపై డేట్, టైం, లైవ్ యాక్టివిటీస్, విడ్జెట్స్‌ను చూడవచ్చు. ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి పక్కన పెట్టినప్పుడు ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.
దీంతో పాటు జర్నల్ యాప్‌ను కూడా క్రియేట్ చేశారు. అంటే వినియోగదారుల డైలీ లైఫ్‌ను, వారి యాక్టివిటీస్‌ను ఇది ట్రాక్ చేస్తుంది. దాని ద్వారా వినియోగదారుల జీవితాన్ని జర్నల్‌లా రూపొందిస్తుంది. ఇందులో ఫొటోలు, వీడియోలను కూడా ఇముడ్చుతుంది. ఇలాంటి యాప్‌పై ప్రైవసీ ఎలా ఉంటుందో అని సందేహాలు ఉండటం సహజమే. కానీ ఇది ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను సపోర్ట్ చేస్తుంది.
నేమ్ డ్రాప్ అనే ఫీచర్‌ను కూడా యాపిల్ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా ఇద్దరు యాపిల్ యూజర్లు సమీపంలోకి వచ్చినప్పుడు ఎయిర్ డ్రాప్‌లో ఫొటోలు, వీడియోలు ఎలా షేర్ చేసుకుంటారో, అలా తమ కాంటాక్ట్ డిటైల్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. అంటే మీకు సమీపంలో ఉన్న యాపిల్ యూజర్ల కాంటాక్ట్ డిటైల్స్‌ను మీరు రిక్వెస్ట్ చేయవచ్చు. వారు యాక్సెప్ట్ చేస్తే ఇద్దరి కాంటాక్ట్ డిటైల్స్ ఎక్స్‌ఛేంజ్ అవుతాయి.