ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసులో విచారణ జరుగుతుందని తెలిపారు ఏపీ సీఐడీ అడిషనల్‌ ఎస్పీ రవికుమార్. ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని అన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఎండీ శైలజను మంగళవారం సుదీర్ఘంగా విచారించిన సీఐడీ... పలు కోణాలు ప్రశ్నలు వేసింది. తాము ఇబ్బంది పెట్టేందుకు ఈ విచారణ చేస్తున్నట్టు తమపై ఆరోపణలు రావడంపై అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. 


మార్గదర్శి కేసులో చట్టానికి లోబడే దర్యాప్తు సాగుతుందన్నారు రవికుమార్. ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని అలా ఉన్నట్టు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. విచారణకు మార్గదర్శి యాజమాన్యం సరిగా స్పందించడం లేదని ఆరోపించారు. చట్టాలు ఉల్లంఘించినట్టు ఆధారాలు దొరికాయన్నారు. నిజాలు రాబట్టేందుకు ఎన్నిసార్లైనా విచారిస్తామన్నారు అధికారులు. 


మంగళవారం విచారణలో శైలజ తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సరిగా చెప్పలేదన్నారు రవికుమార్. ఎండీగా అన్ని రకాల సమాచారాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాము అడిగిన ప్రశ్నల్లో 25 శాతం మాత్రమే చెప్పారని పేర్కొన్నారు. విచారణకు వెళ్లి ప్రతిసారి ఏదో వంక పెట్టి ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారని అన్నారు. మరోసారి అవసరమైతే శైలజను విచారిస్తామన్న అధికారులు.. రామోజీరావును కూడా ప్రశ్నిస్తామని వివరించారు. 


మార్గదర్శి కేసులో  సీఐడీ అధికారులు మంగళవారం సంస్ధ ఎండీ శైలజా కిరణ్ ను ప్రశ్నించారు.  గతంలో శైలజపై సీఐడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేయగా.. తెలంగాణ హైకోర్టు వాటిని రద్దు చేసింది. ఏపీ సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రామోజీ రావు నివాసంలో విచారణ జరిపారు.  


ఇటీవలే మార్గదర్శి కేసులో ఆస్తుల అటాచ్   కు ప్రభుత్వం అనుమతి                      


కొద్ది రోజుల కిందటే మార్గదర్శి కేసులో రామోజీ గ్రూప్ ఛైర్మన్‌కు చెందిన రామోజీరావు   ఆస్తులను అటాచ్ చేసేందుకు సీఐడీ ఏపీ హోంశాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఖాతాదారులకు డబ్బులు చెల్లించే స్థితిలో మార్గదర్శి లేదని అందుకే ముందు జాగ్రత్త చర్యగా ప్రజాప్రయోజనాలు కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొంది.  రామోజీరావుకు చెందిన రూ. 793.50 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసేందుకు ఏపీ సీఐడీకి అనుమతి లభించింది. నగదు, బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న నిధులు, మ్యూచువల్ ఫండ్స్‌లో డిపాజిట్లను అటాచ్ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ సీఐడీ ఓ ప్రకటనలో తెలిపింది.


మార్గదర్శిపై ఇవీ అభియోగాలు                             


వడ్డీల పేరుతో డిపాజిట్లు సేకరించడం, నిధులు మళ్లించడం, ఐటీ చట్ట ఉల్లంఘనలకు మార్గదర్శి పాల్పడిందని అభియోగాలు సీఐడీ  మోపింది. ఏపీలో 37 బ్రాంచ్‌ల్లో మార్గదర్శి వ్యాపారాలు చేస్తోంది. 1989 చిట్స్ గ్రూప్స్ ఉన్నాయి. తెలంగాణలో 2,316 గ్రూప్స్‌ నడుస్తున్నాయి అని సీఐడీ పేర్కొంది.  ఇప్పటికే మార్గదర్శిలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆ సంస్థలో సీఐడీ తనిఖీలు చేసింది. కేసులు నమోదు చేసింది. మార్గదర్శి కేసులో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్‌గా పేర్కొంది. ఫోర్‌మెన్‌, ఆడిటర్లతో కలిసి కుట్రకు పాల్పడినట్టు సీఐడీ తెలిపింది. చిట్స్‌ద్వారా సేకరించిన సొమ్మును హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆఫీస్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు వివరించింది.