షియోమీ తన ఎంఐయూఐ 13 అప్‌డేట్‌ను ఏ ఫోన్లకు అందించనుందో చెప్పనుంది. త్వరలో లాంచ్ కానున్న ఎంఐయూఐ 13 యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించే అవకాశం ఉంది. 2021లోనే ఈ అప్‌డేట్‌ను అందిస్తామని షియోమీ సీఈవో లీ జున్ గతంలోనే తెలిపారు.


ఎంఐయూఐ 13ను డిసెంబర్ 16వ తేదీన విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ అప్‌డేట్‌ను మొదట అందుకునే ఫోన్ల జాబితా ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ జాబితాలో మొత్తం తొమ్మిది ఫోన్లు ఉన్నాయి. మీ ఫోన్ ఈ లిస్ట్‌లో ఉంటే ఈ అప్‌డేట్ మీకు ఈ సంవత్సరమే వచ్చే అవకాశం ఉంది.


‘Xiaomiui | Xiaomi & MIUI News’ అనే ట్వీటర్ ఐడీ ఉన్న టిప్‌స్టర్ తెలిపిన దాని ప్రకారం తొమ్మిది ఫోన్లకు ఈ అప్‌డేట్ మొదట రానుంది. మిగతా స్మార్ట్ ఫోన్‌లకు 2022లో ఈ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్లు ఎంఐయూఐ 13 సోర్స్ కోడ్‌లో కనిపించాయి.


ఎంఐయూఐ 13 అప్‌డేట్‌ను అందుకునే ఫోన్లు ఇవే..
1. షియోమీ ఎంఐ మిక్స్ 4
2. షియోమీ ఎంఐ 11
3. షియోమీ ఎంఐ 11 ప్రో
4. షియోమీ ఎంఐ 11 అల్ట్రా
5. షియోమీ ఎంఐ 11 లైట్
6. షియోమీ ఎంఐ 10ఎస్
7. రెడ్‌మీ కే40
8. రెడ్‌మీ కే40 ప్రో
9. రెడ్‌మీ కే40 ప్రో ప్లస్


అయితే ఇవన్నీ చైనీస్ వెర్షన్లు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. మరో టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఫస్ట్ వేవ్‌లో మరిన్ని స్మార్ట్ ఫోన్లకు ఈ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. అభిషేక్ యాదవ్ తెలిపిన దాని ప్రకారం.. షియోమీ ఎంఐ 10, షియోమీ ఎంఐ 9, షియోమీ ఎంఐ 10టీ, రెడ్‌మీ కే30 సిరీస్, షియోమీ మిక్స్ ఫోల్డ్, షియోమీ సీసీ9 ప్రో, రెడ్‌మీ నోట్ 11, రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ 10/10ఎక్స్ స్మార్ట్ ఫోన్లతో పాటు పోకో ఎం2, పోకో ఎం2 ప్రో, పోకో ఎం3, పోకో ఎం4, పోకో ఎక్స్2, పోకో ఎక్స్3, పోకో ఎఫ్2, పోకో సీ3 వంటి పోకో డివైస్‌లకు కూడా ఈ అప్‌డేట్ రానుంది.


ఎంఐయూఐ 13లో రీడిజైన్డ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఉండనుంది. రీడిజైన్ చేసిన ఫాంట్స్, యానిమేషన్స్ కూడా ఇందులో ఉండనున్నాయి. దీంతోపాటు కొత్త వాల్‌పేపర్లు, సెక్యూరిటీ ఇంప్రూవ్‌మెంట్స్ వంటివి కూడా ఇందులో ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా ఈ ఆపరేటింగ్ సిస్టం తయారు చేయనున్నారు. అయితే కొన్ని షియోమీ స్మార్ట్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 కూడా వచ్చే అవకాశం ఉంది.