రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఎన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయి. చాలా విషయాల్లో చాలా రకాలుగా సెక్యూరిటీని పొందే అవకాశం కూడా ఉంటోంది. ఒక్కోసారి పోగొట్టుకున్న వస్తువులను సైతం తిరిగి అందుకోగలుగుతున్నాం. సాధారణంగా చాలా మంది తమ స్మార్ట్ ఫోన్ లను పోగొట్టుకుంటారు. ఫోన్ లేకపోతే దాదాపు చేతులు కట్టేసినట్లే ఉంటుంది. అలాంటి సమయంలో కొన్ని పద్దతులు పాటించడం వల్ల తిరిగి వాటిని పొందే అవకాశం ఉంటుంది. మీ ఫోన్ పోయినట్లు గుర్తించిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. వారు మీ ఫోన్ ను కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. ఒక వేళ వారు కనిపెట్టలేకపోతే.. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


CEIR అనే భారత ప్రభుత్వ పోర్టల్‌ ద్వారా పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడిన స్మార్ట్‌ ఫోన్‌ను ట్రాక్ చేసి, ఎక్కడుందో తెలుసుకోవచ్చు. CEIR అంటే సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. నకిలీ మొబైల్ ఫోన్ మార్కెట్‌ ను అరికట్టడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం దీనిని అభివృద్ధి చేసింది. ఈ వెబ్ సైట్ మీ స్మార్ట్‌ ఫోన్ ఆచూకీని ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. మీ స్మార్ట్ ఫోన్ లోని SIM మార్చబడినప్పటికీ స్మార్ట్‌ ఫోన్‌ కు యాక్సెస్‌ను బ్లాక్ చేయడానికి  అవకాశం కల్పిస్తుంది.


CEIR ఎలా ఉపయోగించాలి?


CEIR వెబ్‌ సైట్‌ ను ఉపయోగించడం చాలా సులభం. మీరు మీ ఫోన్‌ను పోగొట్టుకున్నట్లయితే, CEIR వెబ్‌ సైట్‌ లో బ్లాక్‌ను సెలక్ట్ చేయాలి. ఆ వెంటనే అందులో మీ మొబైల్ నంబర్, IMEI నంబర్, మోడల్ సహా ఇతర వివరాలను అడిగే ఫామ్ ఓపెన్ అవుతుంది. అయితే ఈ ఫామ్ సమర్పించడానికి మీకు పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఫిర్యాదు నంబర్ కచ్చితంగా కావాలి. ఈ ఫామ్ నింపి, సబ్మిట్ చేస్తే.. మీ స్మార్ట్ ఫోన్ బ్లాక్ అవుతుంది. ఒక వేళ కొద్ది రోజుల తర్వాత మీకు ఫోన్ దొరికితే..  అన్‌ బ్లాక్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా, మీ స్మార్ట్‌ ఫోన్‌కు యాక్సెస్‌ను అన్‌ బ్లాక్ చేయవచ్చు. అలాగే  దొంగిలించబడిన స్మార్ట్‌ఫోన్ స్టేటస్ చూడటానికి 'చెక్ రిక్వెస్ట్ స్టేటస్'ను సెలక్ట్ చేయాలి.


ముందుగా మీ ఫోన్ స్టేటస్ తెలుసుకోండి


కనిపించకుండా పోయిన ఫోన్.. దొంగిలించబడిందో? లేదో? ముందుగా తెలుసుకోవాలి. ఇందుకు రెండు మార్గాలున్నాయి. మీరు 14422కి KYM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి IMEI నంబర్ అని మెసేజ్ పంపాలి. వెంటనే మీకు ఫోన్ వివరాలతో రిప్లై వస్తుంది. బ్లాక్‌ లిస్ట్ చేయబడిందని మీకు రిప్లై వస్తే, దానిని ఉపయోగించవద్దు. ఎందుకంటే అది దొంగిలించబడి ఉండవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు మరింత సమాచారాన్ని పొందడానికి Google Play, Apple Storeలో KYM యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు IMEI నంబర్‌ను కనుగొనలేకపోతే,  *#06# డయల్ చేయాలి. IMEI నంబర్ స్మార్ట్‌ ఫోన్ బాక్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఫోన్ పోవడంతో కోల్పోయిన డేటాను తిరిగి పొందడానికి వినియోగదారులు క్లౌడ్ స్టోరేజ్, లేదంటే హార్డ్ డ్రైవ్‌లో ఫైల్‌లను ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవాలి.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!