Spotify: మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ స్పాటిఫై ఒక కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. ఇది రోల్ అవుట్ అయితే యూట్యూబ్‌తో పోటీ పడగలదు. వాస్తవానికి ఇప్పటి వరకు మీరు సంగీతాన్ని వినడానికి మాత్రమే స్పాటిఫైని ఉపయోగించారు. కానీ ఇప్పుడు మీరు మ్యూజిక్ వీడియోలను చూడటానికి కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించగలరు.


స్పాటిఫై తన ప్లాట్‌ఫారమ్‌లో మ్యూజిక్ వీడియో ఫీచర్‌ని తీసుకురావడానికి పరీక్షిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఈ కొత్త ఫీచర్‌ను కొంతమంది ప్రీమియం బీటా వినియోగదారుల కోసం విడుదల చేసింది. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో కంపెనీ సాధారణ వినియోగదారుల కోసం కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావచ్చు.


మ్యూజిక్ వీడియో ఫీచర్
స్పాటిఫైలో మ్యూజిక్ వీడియో ఫీచర్‌ను లాంచ్ చేసిన తర్వాత యూట్యూబ్‌కు పోటీ పెరుగుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఏదైనా మ్యూజిక్ వీడియోను చూడటానికి యూట్యూబ్‌ని మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే యూట్యూబ్‌లో మ్యూజిక్ వీడియోలు మాత్రమే కాకుండా అనేక రకాల వీడియోలను చూడవచ్చు. కానీ స్పాటిఫైలో మ్యూజిక్ వీడియోలు మాత్రమే ప్లే అవుతాయని వార్తలు వస్తున్నాయి.


యూకే, నెదర్లాండ్స్, పోలాండ్, స్వీడన్, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, కొలంబియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, కెన్యాలోని ప్రీమియం బీటా వినియోగదారులకు పూర్తి నిడివి గల మ్యూజిక్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసు ప్రస్తుతం అందుబాటులో ఉందని స్పాటిఫై ధృవీకరించింది. 2030 నాటికి 100 కోట్ల యూజర్ల మార్కును దాటాలనేది స్పాటిఫై లక్ష్యం.


షార్ట్ సర్వీస్ కూడా...
స్పాటిఫై ఈ కొత్త ఫీచర్‌ను ప్రారంభించిన తర్వాత యూట్యూబ్, యాపిల్ మ్యూజిక్ మధ్య పోటీ ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌ల వినియోగదారులు స్పాటిఫై వైపు మళ్లే అవకాశం ఉంది. గత సంవత్సరం స్పాటిఫై... యూట్యూబ్ వంటి చిన్న వీడియో సర్వీసును కూడా ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు తమ సొంత వీడియోలను 30 సెకన్ల వరకు క్రియేట్ చేసి వాటిని స్పాటిఫైలో అప్‌లోడ్ చేయవచ్చు.


స్పాటిఫై కొత్త ప్లాన్‌లను చూస్తే 2030 నాటికి బిలియన్ వినియోగదారులను చేరుకోవడానికి కంపెనీ కొన్ని పెద్ద, ముఖ్యమైన మార్పులు చేయగలదని లేదా కొత్త సర్వీసులను దాని ప్లాట్‌ఫారమ్‌కు యాడ్ చేయవచ్చని తెలుస్తోంది.


మరోవైపు వాట్సాప్ కూడా యూట్యూబ్ తరహా ఫీచర్‌పై పని చేస్తుంది. పెద్ద సైజున్న వీడియోలను ఫార్వార్డ్ చేయడానికి, రివైండ్ చేయడానికి అనుమతించే కొత్త అప్‌డేట్‌పై వాట్సాప్ పని చేస్తుందని సమాచారం. యూట్యూబ్‌లో 10 సెకన్ల పాటు వీడియోను ఫార్వార్డ్ లేదా రివర్స్ చేయగలిగినట్లే, వాట్సాప్‌లో కూడా ఇలా చేయగలరన్న మాట. దీని సహాయంతో మీరు పెద్ద వీడియోలను సులభంగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ చూడవచ్చు. తక్కువ సమయంలో అందులో ఉన్న కంటెంట్‌ను ఈజీగా అర్థం చేసుకోగలరు. ఈ అప్‌డేట్ గురించిన సమాచారాన్ని వాట్సాప్ డెవలప్‌మెంట్‌ను రిపోర్ట్ చేసే వెబ్‌సైట్ Wabetainfo మొదట అందించింది. ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఇది త్వరలో అందరు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 


Also Read: అంతరిక్షంలో వజ్రాల దండ - అందమైన ఫొటో షేర్ చేసిన నాసా!


Also Read: బ్లాక్‌బస్టర్ ఏ-సిరీస్‌లో కొత్త ఫోన్ తెచ్చిన శాంసంగ్ - గెలాక్సీ ఏ55 5జీ ఎలా ఉందంటే?