శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ఫోన్లు మనదేశంలో ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ కానున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్లను విరిగిపోయిన చేప వలల నుంచి వచ్చిన ప్లాస్టిక్‌తో తయారు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. శాంసంగ్ తెలుపుతున్న దాని ప్రకారం.. ఓషన్ బౌండ్ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేయడం ద్వారా ఒక కొత్త మెటీరియల్‌ను తయారు చేసి దాంతో ఈ స్మార్ట్ ఫోన్లను రూపొందించింది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్లో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి.
‘ఓషన్ బౌండ్ ప్లాస్టిక్’ అంటే సముద్రపు నీళ్లలో మనం పడేసే వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బ్యాగ్, విరిగిపోయిన చేప వలలు వంటివి అన్నమాట. ప్రతి సంవత్సరం 6.4 లక్షల టన్నులకు పైగా చేప వలలు సముద్రంలో విరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, ఇటువంటి ప్రకృతికి హానికరం కాని ఉత్పత్తి చేయడం తమ లక్ష్యం అని శాంసంగ్ తెలిపింది.
‘ఈ మార్పుతో గెలాక్సీ టెక్నాలజీ కేవలం డిజైన్ విషయంలో మాత్రమే కాకుండా... పర్యావరణాన్ని మెరుగు పరిచేలా ప్రభావాన్ని చూపిస్తుంది.’ అని పేర్కొంది. అయితే మొత్తం మెటీరియల్‌లో ఈ చేప వలలు ఎంత శాతమో కంపెనీ తెలపలేదు.
శాంసంగ్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం పర్యావరణానికే కాకుండా భూమిపై నివసించే అందరికీ ఉపయోగపడనుందని శాంసంగ్ తెలిపింది. శాంసంగ్ పర్యావరణానికి ఉపయోగపడే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా గొప్ప విషయమే. స్మార్ట్ ఫోన్ ప్యాకేజీల్లో ఉపయోగించడానికి తయారు చేసే ప్లాస్టిక్ ఉత్పత్తిని ఇది తగ్గిస్తుంది.