Samsung Galaxy S24 Launched: శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ భారతదేశంలోనూ, గ్లోబల్ మార్కెట్లలోనూ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు ఫోన్లు ఉన్నాయి. అవే శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా. ఈ మూడు స్మార్ట్ ఫోన్లూ భారతదేశంలో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు. మిగతా రెండూ మోడల్స్‌లోనూ క్వాల్‌కాం చిప్ లేదా శాంసంగ్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ అందుబాటులో ఉన్నాయి.


శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ధర (Samsung Galaxy S24 Price in India)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,999గా ఉంది. యాంబర్ ఎల్లో, కోబాల్ట్ వయొలెట్, ఓనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్ ధర (Samsung Galaxy S24 Plus Price in India)
ఇందులో కూడా రెండు వేరియంట్లే లాంచ్ అయ్యాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.99,999గా ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.1,09,999గా నిర్ణయించారు. కోబాల్ట్ వయొలెట్, ఓనిక్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ మార్కెట్లోకి వచ్చింది. ఒకవేళ శాంసంగ్ స్టోర్‌కు వెళ్లి కొనాలంటే మాత్రం జేడ్ గ్రీన్, సాఫైర్ బ్లూ కలర్ ఆప్షన్లు కూడా అదనంగా అందుబాటులో ఉండనున్నాయి.


శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ధర (Samsung Galaxy S24 Ultra Price in India)
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో మూడు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కొనాలంటే రూ.1,29,999గా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,39,999గానూ, 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,59,999గానూ నిర్ణయించారు. టైటానియం గ్రే, టైటానియం గ్రీన్, టైటానియం ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా కొనవచ్చు.


శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ సేల్ వివరాలు
దీనికి సంబంధించిన ప్రీబుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. శాంసంగ్ లైవ్ ఈవెంట్లో ఈ ఫోన్లను బుక్ చేసుకుంటే రూ.4,999 విలువ చేసే శాంసంగ్ వైర్‌లెస్ ఛార్జర్ ఉచితంగా లభించనుంది. వీటికి సంబంధించిన అధికారిక సేల్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. త్వరలో దీని గురించి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ప్రీ-బుక్ ఆఫర్లు (Samsung Galaxy S24 Offers)
శాంసంగ్ గెలాక్సీ ఎస్24ను కొనుగోలు చేస్తే రూ.15,000 వరకు అప్‌గ్రేడ్ బోనస్ లేదా రూ.8,000 అప్‌గ్రేడ్ బోనస్, రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, ఎస్24 అల్ట్రాలను ప్రీ బుక్ చేసుకుంటే రూ.12,000 అప్‌గ్రేడ్ బోనస్‌తో పాటు రూ.10,000 స్టోరేజ్ అప్‌గ్రేడ్ కూడా లభించనుంది. ఈ స్టోరేజ్ అప్‌గ్రేడ్ ద్వారా మీరు 256 జీబీ వేరియంట్‌ను ప్రీ-బుక్ చేసుకుంటే ఎటువంటి అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా 512 జీబీ వేరియంట్‌ను పొందవచ్చన్న మాట. అలాగే శాంసంగ్ ఫైనాన్స్ ద్వారా 11 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3, ఎక్సినోస్ 2400 ప్రాసెసర్లు ఉండనున్నాయి. 12 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్లు పని చేయనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌కు ఏకంగా ఏడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్లు అందించనున్నారు. అలాగే ఏడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు కూడా అందించనున్నారు. వీటిలో 6.8 అంగుళాల వరకు సైజు ఉండే డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ స్క్రీన్లు ఉండనున్నాయి. వీటి రిఫ్రెష్ రేట్ 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ వరకు ఉండనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్24, ఎస్24 ప్లస్‌ల్లో వెనకవైపు 50 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉండనున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ అందించారు. మూడు ఫోన్లలోనూ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్‌లో 4900 ఎంఏహెచ్ బ్యాటరీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. వీటిని 45W ఛార్జర్‌తో ఛార్జ్ చేయవచ్చు. అడాప్టర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!