రిలయన్స్ జియో వార్షిక సమావేశం (ఏజీయం) సోమవారం జరిగింది. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన ప్రణాళికలను ముకేశ్ అంబానీ వివరించారు. ఓటీటీ రంగంలో రిలయన్స్‌కు ఉన్న ప్లాన్లను కూడా ఈ సమావేశంలో తెలిపారు.
రిలయన్స్ మీడియా బిజినెస్ గడిచిన ఏడాదిలో వృద్ధిని నమోదు చేసిందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. సబ్‌స్క్రిప్షన్లు, ప్రకటనల ఆదాయం మరింత గణనీయ వృద్ధి నమోదుచేసిందన్నారు. వీటితో పాటు ఎంటర్ టైన్‌మెంట్ విభాగం, మీడియా ఛానెళ్లు కూడా దూసుకెళ్తున్నాయన్నారు.
ఐదేళ్ల పాటు ఐపీఎల్ ప్రసార హక్కులను రిలయన్స్ దక్కించుకున్నాయని తెలిపారు. అలాగే మూవీ రైట్స్, ఓటీటీ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రిలయన్స్ గ్రూపునకు చెందిన వయాకాం18 సంస్థ వూట్ ఓటీటీ సర్వీసులను కూడా ఎప్పుడో ప్రారంభించింది. హిందీ బిగ్‌బాస్, కన్నడ బిగ్‌బాస్‌లు ఇందులోనే ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. అయితే ఇటీవలే ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కూడా ఐదేళ్ల పాటు రిలయన్స్ గ్రూపు దక్కించుకుంది.
ప్రస్తుతం వూట్ యాప్ క్వాలిటీ ఆకట్టుకునే విధంగా లేదు. దీనికి తోడు జియోకు ప్రత్యేకంగా జియో సినిమా అనే ప్రత్యేకమైన ఓటీటీ కూడా ఉంది. మరి వీటన్నిటినీ కలిపి ఒకే ఓటీటీగా మారుస్తారా? లేకపోతే మరో ఓటీటీ సర్వీసును ప్రారంభిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
రాజు తలుచుకుంటే దెబ్బలకు, అంబానీ తలుచుకుంటే డబ్బులకు కొదవేముంది? ఒకవేళ సీరియస్‌గా జియో తరహాలో విప్లవాత్మక ఓటీటీ సర్వీసులను తక్కువ ధరకే ప్రారంభిస్తే మాత్రం మిగతా ఓటీటీలకు గడ్డుకాలం ప్రారంభం అయిందని చెప్పవచ్చు.
ఎందుకంటే జియో దెబ్బకు మిగతా టెలికాం సంస్థలు ఎంత కుదేలయ్యాయో తెలియనిది కాదు. ఎయిర్‌సెల్, యూనినార్‌లు పూర్తిగా సేవలను నిలిపివేయగా, టాటా డొకొమో ఎయిర్‌టెల్‌లో కలిసిపోయింది. వొడాఫోన్, ఐడియాలు రెండూ కలిసిపోయి వీఐగా మారిపోయాయి.
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాంల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, జీ5 వంటి సర్వీసులు ముందంజలో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే సబ్‌స్క్రైబర్లను విపరీతంగా కోల్పోతుంది. ప్రైమ్ వీడియోకు అమెజాన్ సపోర్ట్ ఉండగా, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌కు బలమైన సబ్‌స్క్రైబర్ బేస్ ఉంది. ఇప్పుడు జియో కూడా దిగితే ఓటీటీ ప్లాట్‌ఫాంల్లో మరింత పోటీ పెరగనుంది. కానీ అంబానీ నేరుగా ఓటీటీల్లోకి దిగుతారా లేకపోతే పరోక్షంగా పెట్టుబడులు పెడతారా అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!