Reuters X Account in India | న్యూఢిల్లీ: భారతదేశంలో పలు వార్తా సంస్థల ఎక్స్ ఖాతాలపై ఆంక్షలు విధించారు. వార్తా సంస్థ రాయిటర్స్ అధికారిక X ఖాతా (గతంలో ట్విట్టర్) భారత్‌లో అందుబాటులో లేదు. రాయిటర్స్ అధికారిక ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించే వినియోగదారులకు "చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఖాతా నిలిపివేశాం" అని సందేశం వస్తుంది. అయితే, ఈ విషయంపై రాయిటర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. Reuters World ఎక్స్ ఖాతా సైతం భారత్‌లో తాత్కాలికంగా నిలిపివేశారు.

“@Reuters ని చట్టపరమైన డిమాండ్కు ప్రతిస్పందనగా భారత్‌లో వారి ఖాతాను నిలిపివేశారు,” అని ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులకు కనిపిస్తుంది. మీడియా నివేదికల ప్రకారం, రాయిటర్స్ ప్రధాన ఖాతా శనివారం రాత్రి 11:30 గంటల నుంచి అందుబాటులో లేదు. దీనిపై న్యూస్ ఏజెన్సీ స్పందించాల్సి ఉంది.

భారతదేశంలో రాయిటర్స్ ప్రధాన ఖాతాలు బ్లాక్ చేసినప్పటికీ, రాయిటర్స్ టెక్ న్యూస్, రాయిటర్స్ పిక్చర్స్, రాయిటర్స్ ఫ్యాక్ట్ చెక్, రాయిటర్స్ ఆసియా, రాయిటర్స్ చైనా సహా సంస్థకు అనుబంధంగా ఉన్న పలు ఇతర ఎక్స్ ఖాతాలు అందుబాటులో ఉన్నాయి.

చైనా, టర్కీ ఎక్స్ ఖాతాలు బ్లాక్..

చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఎక్స్ ఖాతా, టర్కీకి చెందిన టీఆర్‌టీ వరల్డ్ ఎక్స్ ఖాతాలను సైతం కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. దాంతో భారత్ లోని యూజర్లు ఆ ఎక్స్ ఖాతాలను యాక్సెస్ చేయలేరు. ఆ ఎక్స్ ఖాతాలను ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. భారత ప్రభుత్వంపై విధ్వేశం చిమ్ముతూ పోస్టులు చేసినా, భారత ఆర్మీపై, రక్షణ శాఖ, దేశ భద్రతకు సంబంధించి అవాంఛిత వివరాలు, కంటెంట్ పోస్ట్ చేస్తే సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం ఆంక్షలు విధించే హక్కు కలిగి ఉంది.

X మార్గదర్శకాల ప్రకారం తాజా రిపోర్టు గమనిస్తే.. కోర్టు ఉత్తర్వులు లాంటి చట్టపరమైన డిమాండ్ కు ప్రతిస్పందనగా ఎక్స్ లో కొన్ని ఖాతాలు నిలిపివేయవచ్చు. సంస్థ నుంచి సరైన స్పందన, వివరణ లాంటివి వస్తే భారత ప్రభుత్వం రాయిటర్స్ తో పాటు ఇతర ఎక్స్ ఖాతాలను రీయాక్టివ్ చేసే అవకాశం ఉందని సమాచారం.