రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 మనదేశంలో ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో 43 అంగుళాల 4కే డిస్‌ప్లేను అందించనున్నారు. రెడ్‌మీ నోట్ 11ఎస్, రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రోలతో పాటు ఈ టీవీ లాంచ్ కానుంది.


రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్‌లో ఎక్స్50, ఎక్స్55, ఎక్స్65 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎక్స్ సిరీస్ లైనప్‌లో అన్నిటి కంటే చిన్న డిస్‌ప్లే ఉన్న టీవీ ఇదే కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెడ్‌మీ స్మార్ట్ టీవీలో 43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది. కానీ త్వరలో లాంచ్ కానున్న 43 అంగుళాల టీవీలో 4కే డిస్‌ప్లేను అందించనున్నారు. దీంతోపాటు ఇది 4కే హెచ్‌డీఆర్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.


ఈ స్మార్ట్ టీవీలో అందించే ప్రాసెసర్ గురించి కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ టీవీ ‘ఫ్యూచర్ రెడీ ఫ్లాగ్ షిప్ పెర్ఫార్మెన్స్‌’ను అందిస్తుందని కంపెనీ తన ఈవెంట్ పేజీలో పేర్కొంది. రెడ్‌మీ గతంలో లాంచ్ ఎక్స్-సిరీస్ స్మార్ట్ టీవీల్లో క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ను అందించారు. వీటిలో 2 జీబీ ర్యామ్ కూడా ఉంది. 30W సౌండ్ అవుట్‌పుట్‌ను ఈ స్మార్ట్ టీవీ అందించనుంది. డాల్బీ ఆడియో ఫీచర్ కూడా ఇందులో ఉంది.


ఇక సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే.. రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో కంపెనీ లేటెస్ట్ ప్యాచ్‌వాల్ సాఫ్ట్ వేర్‌ను అందించనున్నారు. ఐఎండీబీ ఇంటిగ్రేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. ప్యాచ్‌వాల్ అనేది షియోమీ లాంచర్. ఓటీటీ ప్లాట్‌ఫాంల నుంచి కంటెంట్‌ను ఇది మీ స్మార్ట్ టీవీలో డిస్‌ప్లే చేయనుంది.


దీంతోపాటు స్మార్ట్ లైట్స్, ఎంఐ ఎయిర్ ప్యూరిఫయర్ వంటి వాటిని ఇది సపోర్ట్ చేయనుంది. షియోమీ దీని ధరను ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్‌లో ఎక్స్50 ధర రూ.37,999గా ఉంది. సాధారణంగా 43 అంగుళాల టీవీల ధరలు రూ.30 వేలలోపే ఉంటాయి. కాబట్టి దీని ధర కూడా ఇదే రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.