షియోమీ తన రెడ్‌మీ కే50 సిరీస్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లను త్వరలో లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో రెడ్‌మీ కే50, రెడ్‌మీ కే50 ప్రో, రెడ్‌మీ కే50 గేమింగ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి. ఈ మధ్యే తాజాగా ఒక షియోమీ స్మార్ట్ ఫోన్ 21121210G మోడల్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో కనిపించింది. ఇది పోకో ఎఫ్4 జీటీ అని తెలుస్తోంది. హయ్యర్ ఎండ్ వేరియంట్ రెడ్‌మీ కే50కి గ్లోబల్ వేరియంట్‌గా ఈ ఫోన్ రానుందని అంచనా. ఐఎంఈఐ డేటా బేస్‌లో కూడా కనిపించింది కాబట్టి ఈ ఫోన్ మనదేశంలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ లిస్టింగ్‌ను మొదట షియోమీయూఐ గుర్తించింది. రెడ్‌మీ కే50 గేమింగ్ ఎడిషనే పోకో ఎఫ్4 జీటీగా లాంచ్ కానుందని కూడా షియోమీయూఐనే ముందుగా అంచనా వేసింది. తాజా కథనం ప్రకారం.. రెడ్‌మీ కే50 సిరీస్‌లో సైబర్ ఇంజిన్ హాప్టిక్స్ మోటార్ ఉండనుంది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఫోన్లలో అందించిన అన్ని ఎక్స్-యాక్సిస్ హాప్టిక్స్ మోటర్ల కంటే ఇదే బలమైనదని షియోమీ అంటోంది.
పోకో ఎఫ్4 జీటీ స్పెసిఫికేషన్లు
రెడ్‌మీ కే50 గేమింగ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు కూడా ఇటీవలే లీకయ్యాయి. ఇదే ఫోన్ పోకో ఎఫ్4 జీటీగా లాంచ్ కానుందని కాబట్టి రెండిట్లోనూ ఒకే స్పెసిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది. లీకుల ప్రకారం.. ఈ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే అందించనున్నట్లు తెలుస్తోంది. డ్యూయల్ వీసీ కూలింగ్ సిస్టం, గేమింగ్ షోల్డర్ ట్రిగ్గర్స్, ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండనున్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ లేదా 48 మెగాపిక్సెల్‌గా ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.