పోకో ఎక్స్4 స్మార్ట్ ఫోన్ సిరీస్ త్వరలో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీటిలో ఒక ఫోన్ ఇటీవలే సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కూడా కనిపించింది. మలేషియా సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ కనిపించినట్లు తెలుస్తోంది. ఇదే స్మార్ట్ ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) వెబ్‌సైట్‌లో కూడా కనిపించింది. అయితే పోకో దీని గురించి అధికారికంగా ప్రకటించలేదు.
పోకో ఎక్స్ 5జీ గీక్ బెంచ్ వెబ్‌సైట్లో కూడా కనిపించిందని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలిపారు. ఇప్పటివరకు వస్తున్న లీకుల ప్రకారం.. ఈ ఫోన్ షియోమీ 2201116PG అనే మోడల్ నంబర్‌తో కనిపించింది. ఇదే ఫోన్ పోకో ఎక్స్4 5జీగా లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఇదే స్మార్ట్ ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్‌లో 2201116PI మోడల్ నంబర్‌తో కనిపించింది. కాబట్టి మనదేశంలో కూడా ఈ ఫోన్ లాంచ్ కానుందని అర్థం చేసుకోవచ్చు. ఈ లిస్టింగ్ ప్రకారం.. ఇందులో 5జీ సపోర్ట్ కూడా ఉండనుంది.
ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్‌ను కూడా ఇందులో అందించారు. గతంలో వచ్చిన కథనం ప్రకారం.. రెడ్‌మీ నోట్ 11 ప్రో 5జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా పోకో ఎక్స్4 5జీ లాంచ్ కానుంది. రెడ్‌మీ నోట్ 11 స్మార్ట్ ఫోన్‌ను పోకో ఎం4 ప్రో 5జీగా లాంచ్ చేసింది. ఇప్పుడు పోకో ఎక్స్4 5జీ విషయంలో కూడా కంపెనీ దాన్నే ఫాలో అవుతుందని తెలుస్తోంది.
రెడ్‌మీ నోట్ 11 ప్రో స్మార్ట్ ఫోన్ కూడా అధికారిక లాంచ్‌కు సిద్ధం అయింది. పోకో ఎక్స్4 5జీలో ఏ ఫీచర్లు ఉండనున్నాయో.. ఈ లాంచ్‌లో తెలిసే అవకాశం ఉంది. రెడ్‌మీ నోట్ 11 ప్రో 5జీలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను అందించే అవకాశం ఉంది.
ఇందులో 6.67 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నట్లు సమాచారం. వీటిలో 108 మెగాపిక్సెల్ కెమెరా ప్రధాన సెన్సార్‌గా ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. అంటే పోకో ఎక్స్4 5జీలో కూడా 108 మెగాపిక్సెల్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం.