వన్‌ప్లస్ మనదేశంలో రూ.20 వేలలోపు కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ మనదేశంలో ఇటీవలే వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 90 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు సమాచారం. దీంతో రియల్‌మీ, షియోమీ, ఒప్పో, వివో వంటి బ్రాండ్లతో ఈ విభాగంలో వన్‌ప్లస్ పోటీపడనుంది. రూ.20 వేలలోపు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం విపరీతమైన పోటీ నెలకొంది. ఇప్పుడు వన్‌ప్లస్ కూడా రానుంది కాబట్టి పోటీ మరింత వేడెక్కనుంది.
ప్రస్తుతం వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో నార్డ్ 2 5జీ, నార్డ్ సీఈ 5జీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 2 ధర రూ.27,999 నుంచి ప్రారంభం కానుంది. ఇక వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ధర రూ.22,999 నుంచి రూ.27,999 మధ్య ఉంది.
ఇక వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ 5జీ మనదేశంలో ఫిబ్రవరిలో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటివరకు వస్తున్న కథనాల ప్రకారం ఈ ఫోన్ ధర రూ.28,000 రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. వన్‌ప్లస్ తన నార్డ్ సిరీస్‌లో బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చేయడం ప్రారంభించింది.