ఒక్క పామును చూస్తేనే మనం హడలిపోతాం. కానీ, ఆ ఇంట్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 124 పాములు ఉన్నాయి. వాటి మధ్య ఓ వ్యక్తి నిర్జీవంగా పడివున్నాడు. అయితే, అతడు ఎలా చనిపోయాడనేది తెలియరాలేదు. ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్‌లో చోటుచేసుకుంది. 


49 ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఓ రోజు ఆ ఇంట్లో ఎలాంటి అలికిడి వినిపించలేదు. ఆ వ్యక్తి కూడా కనిపించలేదు. దీంతో పక్కింటి వ్యక్తికి అనుమానం వచ్చి.. ఆ ఇంటికి వెళ్లాడు. తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో కాలింగ్ బెల్ కొట్టాడు. కానీ, అతడు స్పందించలేదు. కిటికీ నుంచి చూడగా.. ఆ వ్యక్తి ఓ గదిలో సొమ్మసిల్లి కనిపించాడు. దీంతో అతడు 911కు కాల్ చేశాడు. 


ఈ సమాచారం అందుకోగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆ గదిలో అడుగుపెట్టగానే వారికి గుండె ఆగినంత పనైంది. నిర్జీవంగా పడివున్న అతడి చుట్టూ.. వందలాది పాములు ఉన్నాయి. లక్కీగా అవి బయట లేవు. ఇనుప ఊచలతో తయారు చేసిన బాక్సుల్లో ఉన్నాయి. వాటిలో విషపూరితమైన పాములు, విషం లేని పాములు కూడా ఉన్నాయి.


మొత్తం 124 పాములను అతడు అధికారులకు తెలియకుండా ఒకే గదిలో పెట్టి పెంచుతున్నాడు. మరి, అతడు పాము కాటు వల్ల చనిపోయాడా? లేదా మరేదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. మేరీ‌ల్యాండ్‌లో అధికారుల అనుమతి లేకుండా పాములను, మరే వన్య ప్రాణులను ఇళ్లల్లో ఉంచకోకూడదు. కానీ, అన్నేసి పాములను అతడు ఇంట్లో ఉంచుకుని ఏం చేస్తున్నాడనేది ఇంకా తెలియాల్సి ఉంది. 






అతడి ఇంట్లో కనుగొన్న పాముల్లో కొండచిలువలు, నాగుపాములు, కట్ల పాములు, బ్లాక్ మాంబాలు సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న చార్లెస్ కౌంటీ జంతు నియంత్రణ అధికారులు విషం లేని పాములను వేరు చేసి, ప్రత్యేకమైన ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టారు. విషం లేని పాములను వర్జీనియాకు, విషపూరిత పాములను ఉత్తర కరోలినాకు తరలించారు.