Nothing New Phone: నథింగ్ ఫోన్ 2ఏ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. నథింగ్ కంపెనీ స్థాపించాక లాంచ్ చేసిన మూడో ఫోన్ ఇది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించనున్నారు. ఫోన్ వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఐపీ54 రేటెడ్ బిల్డ్‌తో ఈ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ ట్రేడ్‌మార్క్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ తరహా గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను నథింగ్ ఫోన్ 2ఏలో కూడా చూడవచ్చు.
నథింగ్ ఫోన్ 2ఏ ధర (Nothing Phone 2a Price in India)
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.23,999గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.27,999గా ఉంది. వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మార్చి 12వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది.
స్పెషల్ లాంచ్ ఆఫర్ కింద మార్చి 12వ తేదీన ఈ ఫోన్‌ను రూ.19,999కే కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2,000 క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. దీంతోపాటు ఎక్స్‌ఛేంజ్‌పై రూ.2,000 అదనపు తగ్గింపు అందించనున్నారు. తొమ్మిది నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
నథింగ్ ఫోన్ 2ఏ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Nothing Phone 2a Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5 ఆపరేటింగ్ సిస్టంపై నథింగ్ ఫోన్ 2ఏ పని చేయనుంది. మూడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లు అందిస్తామని నథింగ్ ప్రకటించింది. ఇందులో 6.72 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 30 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ మధ్య ఉండనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5... డిస్‌ప్లేకు ప్రొటెక్షన్ అందించనుంది. హెచ్‌డీఆర్10+ సపోర్ట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆక్టాకోర్ 4 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 12 జీబీ వరకు ర్యామ్‌ను కూడా ఈ ఫోన్‌లో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక 50 మెగాపిక్సెల్ సెన్సార్ ప్రధాన కెమెరా కాగా, మరో 50 మెగాపిక్సెల్ సెన్సార్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కావడం విశేషం. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను ప్రధాన కెమెరా సపోర్ట్ చేయనుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 114 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను డెలివర్ చేయనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.
256 జీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై 6 డైరెక్ట్, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, 360 డిగ్రీ యాంటెన్నా, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కూడా అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ద్వారా నథింగ్ ఫోన్ 2ఏను అన్‌లాక్ చేయవచ్చు. హైడెఫినిషయన్ మైక్రోఫోన్లు, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇందులో ఉన్నాయి.
ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ఫోన్ అందించనుందని కంపెనీ అంటోంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ద్వారా 59 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ కానుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది. ఇంతకు ముందు రెండు ఫోన్ల తరహాలోనే ట్రాన్స్‌పరెంట్ గ్లిఫ్ డిజైన్‌తో నథింగ్ ఫోన్ 2ఏ మార్కెట్లో లాంచ్ అయింది.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?