యూకేకు చెందిన ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ నథింగ్ (Nothing) నుంచి ఇయర్ ఫోన్స్ వచ్చేశాయి. నథింగ్ ఇయర్ 1 (Nothing Ear 1) ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్స్ (టీడబ్ల్యూఎస్) భారత మార్కెట్‌లోకి లాంచ్ అయ్యాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వైర్‌లెస్ చార్జింగ్ వంటివి ఇందులో ప్రీమియం ఫీచర్లుగా ఉన్నాయి. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకులు కార్ల్ పెయ్ నథింగ్ కంపెనీని స్థాపించారు. దీనిని ప్రారంభించాక కంపెనీ నుంచి వచ్చిన మొదటి ప్రొడక్ట్ ఇదే. ఈ ఇయర్ ఫోన్స్ సేల్ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.
ధర, ఫీచర్లు..
గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే నథింగ్ ఇయర్ 1 ధర భారతదేశంలో తక్కువగానే ఉంది. మన దేశంలో దీని ధర రూ.5,999గా ఉంది. భారతదేశంలో మిడ్‌రేంజ్ విభాగంలో వచ్చిన ఒప్పో, సోనీ, శామ్‌సంగ్, ఆంకర్ సౌండ్‌కోర్ వంటి కంపెనీ ఉత్పత్తులతో ఇవి పోటీ పడే అవకాశం ఉంది. అయితే నథింగ్ ఇయర్ 1లో ఉన్న ప్రీమియం ఫీచర్లు, డిజైన్ వంటివి మిగతా వాటి కంటే భిన్నంగా ఉండేట్లు చేస్తాయి.
10 నిమిషాల్లోనే 8 గంటల ప్లేబ్యాక్..
నథింగ్ ఇయర్ 1ను ప్రత్యేకమైన డిజైన్‌లో రూపొందించారు. చార్జింగ్ ఎక్కుతున్నప్పుడు లోపల ఉన్న ఇయర్ ఫోన్స్‌ను చూసే విధంగా ట్రాన్స్‌పరెంట్ కేస్ ఇచ్చారు. చార్జింగ్ కేసు కూడా ట్రాన్స్‌పరెంట్ గానే ఉంటుంది. యూఎస్‌బీ టైప్-సీతో పాటుగా క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. కేవలం 10 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే.. దాదాపు 8 గంటల ప్లేబ్యాక్ టైం లభిస్తుంది. ఇందులో ఉండే ఇయర్‌పీస్ 5.7 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. దీని కేస్ 34 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. వీటిలో 11.6 మిల్లీమీటర్ల డైనమిక్ డ్రైవర్లు కూడా ఉంటాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2 సపోర్ట్ కూడా ఉంది. ఎస్‌బీసీ, ఏఏసీ బ్లూటూత్ కోడెక్స్‌ను (codecs) ఇవి సపోర్ట్ చేస్తాయి.
ఇయర్ 1 యాప్ ద్వారా..
ఈ మధ్యకాలంలో ఈ ధరల రేంజ్ లో లాంచ్ అయిన ప్రీమియం ఇయర్‌బడ్స్‌లో మాదిరిగానే.. నథింగ్ ఇయర్ 1లో కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. ప్లేబ్యాక్, నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్‌పరెన్సీ మోడ్స్, వాల్యూమ్ వంటి వాటిని ఈజీగా ఆపరేట్ చేసేందుకు ఇందులో టచ్ కంట్రోల్స్‌ను అందించింది. టచ్ కంట్రోల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఇంటెన్సిటీ సెట్టింగ్స్‌ను కస్టమైజ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఇయర్ 1 యాప్ ద్వారా వీటిని కస్టమైజ్ చేయవచ్చని తెలిపింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలలో ఈ యాప్ ఉంటుంది. ఈక్వలైజర్ సెట్టింగ్స్, ఫాస్ట్ పెయిరింగ్, ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్ వంటి అదనపు ఫీచర్లను కూడా ఇందులో అందించారు. ఇన్ ఇయర్ డిటెక్షన్ అనే ఫీచర్ ద్వారా మ్యూజిక్‌ను ప్లే చేయడం, ఆపడం (పాజ్) వంటివి చేయవచ్చు.