నోకియా నుంచి అతి తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ లాంచ్ అయింది. నోకియా 110 4 జీ (Nokia 110 4G) ఫోన్ భారత మార్కెట్‌లోకి విడుదల అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ జూన్ నెలలోనే విడుదల కాగా.. తాజాగా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్‌లో 4 జీ కనెక్టివిటీ, హెచ్‌డీ వాయిస్ కాలింగ్, వైర్డ్ & వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో ఉంటాయి. వీటితో పాటు 3.5 ఎంఎం ఆడియో జాక్, 3-ఇన్ -1 స్పీకర్లు, వీడియో ప్లేయర్, ఎమ్‌పీ 3 ప్లేయర్ ఉంటాయి. 
ఇంతకు ముందు నోకియా నుంచి విడుదలైన మోడల్స్‌తో పోలిస్తే ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్‌తో ఉండనుంది. చేతిలో ఫోన్ పట్టుకునేందుకు వీలుగా గ్రిప్ ఉండేలా దీనిని డిజైన్ చేసినట్లు సంస్థ తెలిపింది. గతంలో నోకియా నుంచి విడుదల అయిన నోకియా 110 తదుపరి వెర్షన్‌గా ఇది ఉండనుంది. ఇటీవల కాలంలో చాలా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఫీచర్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. దీనిలో భాగంగా నోకియా కూడా కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. తాజాగా రిలీజ్ అయిన నోకియా 110 4 జీ ఫోన్.. మైక్రోమాక్స్ భారత్ 1, ఇంటెక్స్ ఆక్వా ఏ4 లకు గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ నిపుణులు అంటున్నారు.  



ధర, స్పెసిఫికేషన్లు..
నోకియా 110 4 జీ ఫోన్ ధరను రూ.2,799గా నిర్ణయించింది. ఇది ఎల్లో, ఆక్వా, బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఇందులో 4జీ కనెక్టివిటీతో పాటు హెచ్‌డీ వాయిస్ కాలింగ్ సపోర్ట్‌ ఉంది. ఇందులో 1.8 అంగుళాల QVGA (120x160 పిక్సెల్స్) కలర్ డిస్‌ప్లేను అందించారు. సిరీస్ 30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 



  • 128 ఎంబీ ర్యామ్, 48 ఎంబీ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 32 జీబీ వరకు అదనంగా పెంచుకోవచ్చు. 

  • 0.8 మెగాపిక్సెల్ క్యూవీజీఏ కెమెరా కూడా ఇందులో ఉంది.

  • యూనిసోక్ టీ107 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 

  • ఇందులో 1020 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ 13 రోజుల వరకు స్టాండ్‌బై టైం, 16 గంటల వరకు మ్యూజిక్ ప్లే బ్యాక్ టైం, 5 గంటల వరకు 4జీ టాక్ టైంను అందిస్తుంది.  

  • వైర్డ్ & వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియోను ఇందులో అందించారు. అంటే ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయకపోయినా ఎఫ్ఎమ్ రేడియోను యాక్సెస్ చేయవచ్చు. 

  • ఇందులో వీడియో ప్లేయర్, ఎంపీ3 ప్లేయర్, 3 ఇన్ 1 స్పీకర్లు ఉంటాయి.  

  • స్నేక్ గేమ్, ఆక్స్ ఫోర్డ్ డిక్షనరీ ఉంటాయి. 

  • దీని బరువు 84.5 గ్రాములు ఉంటుంది. 

  • నోకియా డాట్ కామ్, అమెజాన్ డాట్ ఇన్‌లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.