శ్రీలంక పర్యటలో (Srilanka Tour) ఉన్న టీమ్ ఇండియా (Team India) ఇప్పటికే 2-0తో వన్డే సిరీస్ (ODI Series) గెలుచుకున్నది. చివరి వన్డే కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్నది. క్లీన్ స్వీప్ చేయాలని టీమ్ ఇండియా అనుకుంటుండగా.. కనీసం చివరి మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని ఆతిథ్య శ్రీలంక జట్టు ఆశిస్తుంది. 


కెప్టెన్‌గా శిఖర్ ధావన్ తొలి సారిగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సిరీస్‌లో భారత జట్టు తొలి సారి టాస్ గెలిచి బ్యాటింగ్ చేయబోతున్నది. గత ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుంటే భారత జట్టు భారీ స్కోర్ సాధించే అవకాశం ఉన్నది. మరో విషయం ఏంటంటే ఈ మ్యాచ్‌లో మొత్తం 6 మార్పులు చేశారు. అయితే తొలి సారి ఐదుగురు క్రికెటర్లు వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేయడం విశేషం. 1980 తర్వాత జట్టులో ఇన్ని భారీ మార్పులు చేయడం ఇదే తొలిసారి. అంతే కాకుండా ఒకే సారి ఐదుగురు క్రికెటర్లు అరంగేట్రం చేస్తుండటం కూడా ఒక రికార్డు.





టీమ్ ఇండియా తరపున వన్డేల్లో సంజూ శాంసన్, నితీశ్ రాణా, చేతన్ సకారియా, క్రిష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహర్ అరంగేట్రం చేశారు. తుది జట్టులో భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతిని ఇచ్చి నవదీప్ సైనీని తీసుకున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో భారత జట్టు భారీ మార్పులు చేసింది. 1980లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐదుగురు క్రికెటర్లు అరంగేట్రం చేశారు. దిలీప్ జోషి, కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, సందీప్ పాటిల్, తిరుమలై శ్రీనివాసన్ ఒకే సారి అరంగేట్రం చేశారు. తిరిగి 41 ఏళ్ల తర్వాత అంత మంది ఒకే సారి వన్డేల్లో భారత జట్టు తరపున తొలి మ్యాచ్ ఆడుతుండటం గమనార్హం.


భారత తుది జట్టు: పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), మనీశ్‌ పాండే, సూర్యకుమార్‌ యాదవ్‌, నితీశ్‌ రాణా, హార్దిక్‌ పాండ్యా, క్రిష్ణప్ప గౌతం, రాహుల్‌ చహర్‌, నవదీప్‌ సైనీ, చేతన్‌ సకారియా. 


శ్రీలంక తుది జట్టు: అవిష్క ఫెర్నాండో, మినోద్‌ భనుక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, చరిత్‌ అసలంక, దసున్‌ శనక(కెప్టెన్‌), రమేశ్‌ మెండిస్‌, చమిక కరుణరత్నే, అకిల ధనుంజయ, దుష్మంత చమీరా, ప్రవీన్‌ జయవిక్రామ. 


తొడగొట్టిన గబ్బర్: 


సాధారణంగా క్యాచ్‌ పడితే గబ్బర్‌ తొడగొట్టి సంబరాలు చేసుకుంటాడు. కెప్టెన్‌గా తొలిసారి టాస్‌ గెలవడంతో అలాగే చేశాడు. వెంటనే తొడగొట్టి ఆనందం వ్యక్తం చేశాడు. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.