Google Maps New Features : గూగుల్ మ్యాప్స్ లో వినియోగదారులకు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్ మ్యాప్స్ ను విరివిగా వినియోగించే వారికి తాజాగా తీసుకువచ్చిన ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. తాజాగా తీసుకువచ్చిన ఫీచర్లలో మొత్తం ఆరు ఉండగా వీటిలో ఏఐ సౌకర్యం,  ఫ్లై ఓవర్ అలర్ట్, ఈవీ చార్జింగ్ స్టేషన్ సమాచారం, మెట్రో టికెట్ వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్ల సహాయంతో యూజర్లు మెరుగైన ప్రయోజనం పొందుతారని కంపెనీ వెల్లడించింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్ లో మార్పులు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మార్పుల్లో భాగంగానే ఆరు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఆయా ఫీచర్లను గూగుల్ గురువారం ప్రకటించింది. 


ముందుగానే ఫ్లై ఓవర్ అలర్ట్.. వాహనదారులకు మేలు 


కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాహనదారులు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య ఫ్లైఓవర్ నుంచి కిందకు దిగడం. గూగుల్ మ్యాప్ పెట్టుకుని కారులో వెళుతున్నప్పుడు నేరుగా వెళ్లాలని మ్యాప్ లో చూపిస్తుంది. కానీ ఎదురుగా ఫ్లై ఓవర్, దాని కింద సర్వీస్ రోడ్డు ఉంటుంది. అటువంటి సమయాల్లో పైనుంచి వెళ్లాలా.? కింది నుంచి వెళ్లాలా..? అనే సందేహం చాలా మందికి తలెత్తుతూ ఉంటుంది. అక్కడ వాహనదారుడి ఆలోచనకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు ఏర్పడుతూ వచ్చింది. అయితే, దీనికి గూగుల్ మ్యాప్ పరిష్కారాన్ని చూపించే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫ్లై ఓవర్ కాల్ అవుట్ పేరిట కొత్త సదుపాయాన్ని తెచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఎప్పటి నుంచో కోరుతున్న ఈ ఫీచర్ వారంలో అందుబాటులోకి రానుంది. ఐఓఎస్ యూజర్లకు కాస్త ఆలస్యంగా ఈ ఫీచర్ లభించనుంది. దీంతోపాటు ఇరుకు రోడ్లకు సంబంధించిన మరో ఫీచర్ ను కూడా గూగుల్ తీసుకువచ్చింది. ఫోర్ వీలర్ లో వెళ్లేటప్పుడు రోడ్లు ఇరుకుగా ఉంటే అటు వైపు ప్రయాణం వద్దు అని గూగుల్ మ్యాప్స్ లోని కొత్త ఫీచర్ చూపించనుంది. ఎనిమిది నగరాల్లో తొలుత ఈ సదుపాయాన్ని తీసుకు వస్తున్నట్లు గూగుల్ తెలిపింది. ఒకవేళ అదే రోడ్లో వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా వెళ్లాలని మ్యాప్స్ చూపించనుంది. కొత్తగా తెచ్చిన ఈ ఫీచర్ ఫ్లై ఓవర్ హెచ్చరికను ముందుగా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇండోర్, బోపాల్, భువనేశ్వర్ వంటి ఎనిమిది నగరాల్లో విడుదల చేసింది. దీనివలన ఆయా ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల మీదుగా ప్రయాణాలు సాగించే వాహనదారులకు మేలు చేకూరనుంది. 



Also Read: జులై నెలలో బెస్ట్ 4 స్మార్ట్ ఫోన్స్​ ఇవే - ధరకు తగ్గ ఫీచర్స్‌!


ఈవీ చార్జింగ్ స్టేషన్లో సమాచారం కూడా అందుబాటులో..


గూగుల్ మ్యాప్స్ లో వినియోగదారులకు ఉపకరించే మరో ఫీచర్ ఈవి చార్జింగ్ స్టేషన్ సమాచారం. దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చార్జింగ్ స్టేషన్లో అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ కార్లు, బైకులు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో అనేక ప్రాంతాల్లో ఈవి చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీటి సమాచారం తెలుసుకోవడంలో ఇబ్బందులు ఉన్నాయి. తాజాగా తీసుకువచ్చిన గూగుల్ మ్యాప్స్ ఫీచర్లలో ఈవి చార్జింగ్ స్టేషన్ సమాచారాన్ని కూడా పొందుపరిచినట్లు చెబుతున్నారు. గూగుల్ మ్యాప్స్ లోనే ఈవి చార్జింగ్ స్టేషన్ ఫీచర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టిన తర్వాత ఈవీ వినియోగదారులు తమ రూట్లో వచ్చే ఈ చార్జింగ్ స్టేషన్ గురించి సులభంగా సమాచారాన్ని పొందేందుకు వీలుంటుంది. దీనివల్ల వినియోగదారులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.


Also Read: 2014 తర్వాత ఇండియాలో ఇంటర్నెట్ విప్లవం - భారీగా పెరిగిన బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు!


మెట్రో టికెట్లు కొనుగోలు 


గూగుల్ ఓఎన్డిసి, నమ్మ యాత్రితో భాగస్వామ్యం కలిగి ఉంది. దీంతో భారతీయ వినియోగదారులు మెట్రో టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఇది కొచ్చి చెన్నై నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు టికెట్లు కొనుగోలు చేయగలరు. గూగుల్ మ్యాప్స్ నుంచి వాటికి నగదు చెల్లించవచ్చు. అందుకు అనుగుణంగా ఈ ఫీచర్ రూపొందించారు.