మోటొరోలా తన కొత్త స్మార్ట్ ఫోన్ మోటో జీ స్టైలస్ 2022ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. గతేడాది లాంచ్ అయిన మోటో జీ స్టైలస్ 2021కు తర్వాతి వెర్షన్‌గా మోటో జీ స్టైలస్ 2022 లాంచ్ అయింది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌ను అందించారు.


మోటో జీ స్టైలస్ 2022 ధర
ఈ ఫోన్ ధరను 299.99 డాలర్లుగా (సుమారు రూ.22,400) నిర్ణయించారు. ఇది వాల్‌మార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. దీంతోపాటు అమెజాన్.కాం, బెస్ట్ బై, మోటొరోలా అధికారిక వెబ్ సైట్లలో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ట్విలైట్ బ్లూ, మెటాలిక్ రోజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది.


మోటో జీ స్టైలస్ 2022 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని పిక్సెల్ రిజల్యూషన్ 2460 x 1080 పిక్సెల్స్‌గా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. మీడియాటెక్ హీలియో జీ88 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.


ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.


ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే రెండ్రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందించనుందని కంపెనీ అంటోంది. దీని మందం 0.94 సెంటీమీటర్లు కాగా.. బరువు 216 గ్రాములుగా ఉంది.