పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 2021 సంవత్సరానికి ఐసీసీ మెన్స్ టీ20ఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. గత సంవత్సరం రిజ్వాన్ బీభత్సమైన ఫాంతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. మిషెల్ మార్ష్, జోస్ బట్లర్, వనిందు హసరంగలను సైతం వెనక్కి నెట్టి రిజ్వాన్ ఈ అవార్డును గెలుచుకున్నాడు.


2021లో 29 మ్యాచ్‌ల్లోనే రిజ్వాన్ 1,326 పరుగులను సాధించాడు. తన బ్యాటింగ్ సగటు 73.66 కాగా, స్ట్రైక్ రేట్ ఏకంగా 134.89గా ఉంది. దీంతోపాటు వికెట్ల వెనుక కూడా మహ్మద్ రిజ్వాన్ కీలక పాత్ర పోషించాడు. 2021 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మహ్మద్ రిజ్వాన్ మూడో స్థానంలో నిలిచాడు.


ఈ సంవత్సరమే తన మొదటి టీ20 శతకాన్ని కూడా మహ్మద్ రిజ్వాన్ అందుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లోనే రిజ్వాన్ 79 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ సంవత్సరం మహ్మద్ రిజ్వాన్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇదేనని చెప్పవచ్చు.


రిజ్వాన్‌కు గట్టిపోటీని ఇచ్చిన మిషెల్ మార్ష్ కూడా ఈ సంవత్సరం మంచి ప్రదర్శనను కనపరిచాడు. ఆస్ట్రేలియా ఈ సంవత్సరం టీ20 ప్రపంచకప్ గెలవడంతో కీలకపాత్ర పోషించాడు. మార్ష్‌తో పాటు డేవిడ్ వార్నర్ కూడా విజృంభించడంతో ఆస్ట్రేలియా తన మొదటి టీ20 వరల్డ్ కప్‌ను సాధించింది.


మహిళల్లో ఉత్తమ టీ20 క్రికెటర్ అవార్డు ఎవరికంటే?
ఇక ఇంగ్లండ్ క్రికెటర్ టామీ బ్యూమెంట్‌కు ఐసీసీ టీ20 ఉమెర్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక స్కోరు తనదే. ప్రపంచం మొత్తంగా మీద మూడో స్థానంలో నిలిచింది. ఎన్నో మ్యాచ్‌ల్లో కీలక సమయాల్లో జట్టును ఆదుకుంది.