వివో తన ఎక్స్‌90 సిరీస్ ఫోన్లను బుధవారం చైనాలో లాంచ్ చేసింది. వీటిలో వివో ఎక్స్90 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఈ ప్రాసెసర్ ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయింది. దీంతో లాంచ్ అయిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇదే. కాబట్టి ప్రస్తుతం దీనికి మార్కెట్లో పోటీ కూడా లేదు. వన్‌ప్లస్ 11 సిరీస్, షావోమీ 13 సిరీస్ ఫోన్లు వచ్చేవరకు దీనికి ఎదురు లేదని చెప్పవచ్చు.


వివో ఎక్స్90 ప్రో ప్లస్ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 6,499 యువాన్లుగానూ (సుమారు రూ.74,000) ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 6,999 యువాన్లుగా (సుమారు రూ.80,000) నిర్ణయించారు. చైనా రెడ్, ఒరిజినల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో వివో ఎక్స్90 ప్రోను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది.


వివో ఎక్స్90 ప్రో  ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంతో వివో ఎక్స్90 ప్రో ప్లస్ లాంచ్ అయింది. ఈ మొబైల్‌లో 6.78 అంగుళాల 2కే ఈ6 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై వివో ఎక్స్90 ప్రో ప్లస్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... వివో ఎక్స్90 ప్రోలో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ జీస్ వన్ ఇంచ్ సెన్సార్‌ను అందించారు. దీని వెడల్పు ఒక అంగుళం ఉండనుందన్న మాట. దీంతో పాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ సెన్సార్, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.


దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్‌గా ఉంది. 80W ఫాస్ట్ చార్జింగ్‌‌ను వివో ఎక్స్90 ప్రో ప్లస్ సపోర్ట్ చేయనుంది. 5జీని కూడా వివో ఎక్స్90 ప్రో ప్లస్ సపోర్ట్ చేయనుంది. వైఫై 6, బ్లూటూత్ వీ5.3, ఎన్ఎఫ్ఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో అందించారు. దీని బరువు 221 గ్రాములుగా ఉంది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?