WhatsApp Greeting Scam: మరికొన్ని గంటల్లో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రపంచమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈ తరుణంలో మనమందరం మన స్నేహితులు, బంధువులకు వాట్సాప్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతుంటాం. రంగు రంగుల చిత్రాలు, ఆకర్షణీయమైన వీడియోలు, హృదయాన్ని హత్తుకునే సందేశాలతో మన ఇన్‌బాక్స్‌లు నిండిపోతుంటాయి. అయితే ఈ పండుగ ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకొని సైబర్‌నేరగాళ్లు అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడలతో మన బ్యాంక్‌ ఖాతాలపై కన్నేశారని మీకు తెలుసా? మీరు చూసే ఒక చిన్న హ్యాపీ న్యూ ఇయర్‌ ఇమేజ్‌ మీ జీవితాల సంపాదనను క్షణాల్లో తుడిచిపెట్టేసే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Continues below advertisement

డిజిటల్ మీడియాలో గత రెండు దశాబ్దాలుగా మారుతున్న టెక్నాలజీని నేరాల సరళిని గమనిస్తే ప్రస్తుతం పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని చెప్పక తప్పదు. ముఖ్యంగా వాట్సాప్ వాడే  ప్రతి ఒక్కరూ కొన్ని రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. 

సాధారణంగా మనకు ఎవరైనా ఫొటో పంపిస్తే, అది కేవలం ఒక చిత్రమని మనం భావిస్తాం. కానీ నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకొని నేరగాళ్లు ఈ ఫొటోల లోపల బైనరీ డేటాను నిక్షిప్తం చేస్తున్నారు. ఇది ఒక రకమైన మయ కోడింగ్‌. మీరు ఆ ఇమేజ్ కేవలం చూడటం వల్ల వెంటనే ప్రమాదం జరగక పోవచ్చు. కానీ మీ మొబైల్‌లో ఇప్పటికే ఏదైనా మాల్‌వైరస్ ఉంటే ఈ ఇమేజ్‌లోని బైనరీ డేటా ఆ వైరస్‌ను యాక్టివేట్ చేస్తుంది. 

Continues below advertisement

దీని వల్ల ఏ జరుగుతుందంటే... మీ మొబైల్‌ ఫోన్ నియంత్రణ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. మీ ప్రమేయం లేకుండానే మీ ఫోన్ ఆపరేట్‌ అవుతుంది. తద్వారా మీ బ్యాంకు ఖాతాలోని నిధులు మాయం అయ్యే ప్రమాదం ఉంది. 

హ్యాపీ న్యూ ఇయర్‌ పేరుతో ఏపీకే ఉచ్చు 

ఈ సీజన్‌లో సైబర్ నేరగాళ్లు విసురుతున్న మరో పెద్ద వల ఏపీకే ఫైల్స్. చూడటానికి ఇది సాధారణ ఇమేజ్‌లా కనిపించే ఫైల్‌ను వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. దీనికి హ్యాపీ న్యూ ఇయర్‌ లేదా న్యూ ఇయర్ విషెస్‌ వంటి ఆకర్షణీయమైన పేర్లు పెడుతున్నారు. వినియోగదారులు ఆత్రుతతో అది ఒక ఫొటో అని భావించి డౌన్‌లోడ్ చేయడానికి క్లిక్ చేస్తారు. కానీ ఇక్కడే అసలు ప్రమాదం ఉంది. 

ఆ ఫైల్‌పేరు నిశితంగా గమనిస్తే చివరలో .apkఅే ఎక్స్‌టెన్షన్‌ ఉంటుంది. సాంకేతిక భాషలో ఏపీకే అంటే ఒక సాఫ్ట్‌వేర్ అని అర్థం. మీరు దాన్ని క్లిక్ చేయగానే అది మీ అనుమతి లేకుండానే మీ మొబైల్‌లో ఒక అప్లికేషన్‌లా ఇన్‌స్టాల్‌ అయిపోతుంది. ఇలా ఇన్‌స్టాల్ అయిన మాల్‌వేర్‌సాఫ్ట‌వేర్‌ మీ మొబైల్‌లోని బ్యాంకింగ్‌ యాప్‌ల వివరాలు, లాగిన్ ఐడీలు, అత్యంత కీలకమైన ఓటీపీలను దొంగిలిస్తుంది. దీని ఫలితంగా, మీకు కనీసం అలర్ట్ మెసేజ్‌ కూడా రాకుండానే మీ బ్యాంకు ఖాతా ఖాళీ పోయే పరిస్థితి ఏర్పడుతుంది. 

భావోద్వేగాలే నేరగాళ్ల పెట్టుబడి 

పండుగలు, ప్రత్యేక సందర్భాలు వచ్చాయంటే ప్రజల్లో ఉత్సాహం, భావోద్వేగాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో డిజిట్ భద్రత పట్ల అప్రమత్తత తగ్గుతుందని నేరగాళ్లు గమనిస్తున్నారు. గతంలో కేవలం సందేహాస్పదమైన లింక్స్ పంపి మోసం చేసే వాళ్లు. ఇప్పుడు ఫొటోల రూపంలోనే సాఫ్ట్‌వేర్‌లను పంపిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. 

మొబైల్‌లో బ్యాంక్‌ యాప్‌లు వాడుతూ, డిజిటల్ లావాదేవీలు చేసే ప్రతి ఒక్కరూ ఈ ముప్పు పరిధిలోకి వస్తారు. ఒక్క చిన్న అజాగ్రత్త క్లిక్‌ వల్ల కలిగే ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా దీని వల్ల కలిగే మానసిక ఒత్తిడి కుటుంబాలను కుంగదీస్తుంది. 

ఎలా రక్షించుకోవాలి?

డిజిటల్ యుగంలో అప్రమత్తతే అతి పెద్ద రక్షణ. మీరు సురక్షితంగా ఉండటానికి నిపుణులు ఈ జాగ్రత్తలు సూచిస్తున్నారు. 

1. ఫైల్ ఎక్స్‌టెన్షన్‌ను చెక్ చేయండి: మీకు ఏదైనా ఫైల్‌ వచ్చినప్పుడు అది కేవం .jph, .jpeg లేదా .png అని ఉందో లేదో చూడండి. ఒక వేళ ఫైల్‌చివర.apk అని ఉంటే అతి ఎంతటి ఆకర్షణీయమైన ఇమేజ్‌లా కనిపించినా వెంటనే డిలీట్ చేయండి. 

2.గుర్తు తెలియని వ్యక్తుల మెసేజ్‌లకు దూరం: తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఇమేజ్‌లు, వీడియోలు లేదా లింక్స్‌ను పొరపాటును కూడా ఓపెన్ చేయొద్దు. 

3. ఆటో- డౌన్‌లోడ్ ఆపేయండి: వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో మీడియా ఆటో డౌన్‌లోడ్‌ ఆప్షన్ డిసేబుల్‌ చేయడం చాలా అవసరం. దీని వల్ల మీకు అవసరమైన ఫైల్స్ మాత్రమే డౌన్‌లౌడ్ చేసుకోగలరు. స్పేస్ కూడా మిగులుతుంది 

4.నమ్మదగిన సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్: మీ మొబైల్‌లో నాణ్యమైన యాంటీ-వైర్‌ లేదా మొబైల్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఇది ప్రమాదకరమైన ఫైల్స్‌ను గుర్తించి హెచ్చరిస్తుంది. 

5. సమాచారాన్ని షేర్ చేయండి: ఈ ముప్పు గురించి మీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా సాంకేతికతై అంతగా అవగాహన లేని పెద్ద వారికి వివరించండి. మీరు పంపే ఈ చిన్న సమాచారం వారికి పెద్ద ఆర్థిక మోసం నుంచి కాపాడవచ్చు.