వొడాఫోన్, ఐడియా సంయుక్తంగా ఏర్పడిన టెలికాం కంపెనీ వీఐ మూసివేత దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థ కష్ట కాలాన్ని ఎదుర్కొంటోందని బ్రోకరేజీ సంస్థ కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇతర టెలికాం సంస్థల నుంచి పోటీ తట్టుకోలేకనే ఈ పరిస్థితి నెలకొందంటున్నారు. మరోవైపు దేశీయ టెలికం సంస్థలైన జియో (Jio), ఎయిర్‌ టెల్‌ (Airtel)లు తమ నెట్‌ వర్కులతో యూజర్లను ఆకర్షిస్తుండగా, వీఐ మాత్రం పూర్తిగా చతికిలపడిందంటున్నారు. ప్రస్తుత పోటీ సమయంలో ఎన్నికల తర్వాతే టెలికం సంస్థలు రేట్లు పెంచే అవకాశం ఉందనే వార్త.. వీఐను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. 


5జీ సేవలు లేక..
మరోవైపు జియో, ఎయిర్‌ టెల్‌లు 5జీ సేవలను విస్తరింపజేశాయి. అలాగే ఆ రెండు కంపెనీలు 5జీ సేవలు ప్రారంభించినా, వాటి ధరల పెంపుపై మాత్రం  ఎటువంటి సూచనలు ఇవ్వలేదు. ఇక వీఐ మాత్రం ఇంకా ఆ సేవల జోలికే పోలేదు. ప్రస్తుతం ఆ నెట్‌ వర్క్‌ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది. ఇతర నెట్‌వర్క్‌లతో పోటీ పడలేక, రేట్లు పెంచే పరిస్థితి లేక తీవ్రంగా యాజమాన్యం సతమతమవుతోంది. 


అయితే, 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాకే రేట్ల పెంపు ఉంటుందని కోటక్‌ అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు పెంచకపోతే వీఐ నెట్‌ వర్క్‌కు పెట్టుబడులు సమకూర్చుకోవడం, 5జీ సేవలు (VI 5G Services) ప్రారంభించడం కష్టతరమవుతుందని కోటక్‌ తెలిపింది. రాబోయే 12 నెలల్లో వొడాఫోన్‌ రూ.5,500 కోట్ల మేర నిధుల లోటు ఎదుర్కొనే అవకాశం ఉందని, రేట్ల పెంపు, నిధుల సమీకరణ ఆలస్యమైతే సంస్థ మూసివేతకు దారితీయొచ్చని హెచ్చరించింది. మరోవైపు వీఐ పతనానికి ద్రవ్యోల్బణం సైతం ఆర్బీఐ నిర్దేశించుకున్న లక్ష్యానికి ఎగువన ఉండడం మరో కారణమని తెలిపింది.  ఈ పరిస్థితుల్లో సబ్ స్క్రైబర్స్ సంఖ్య మరింత క్షీణించి.. నిధుల సమీకరణ ప్రణాళికలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. రేట్ల పెంపు ఆలస్యం చేయడం వల్ల వొడాఫోన్‌ ఐడియా మనుగడ ప్రశ్నార్థకమవుతుందని అభిప్రాయపడింది.


జాతీయ మీడియా నివేదిక ప్రకారం... డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఇప్పుడు వొడాఫోన్ ఐడియా మీద దృష్టి పెట్టింది. కంపెనీ స్థితిగతుల్ని అంచనా వేయడానికి ఆర్థిక లెక్కలు & కార్యకలాపాలను పరిశీలిస్తోంది. ఈ పరిశీలనల ఆధారంగా, ఈ టెల్కో పరిస్థితి మీద కేంద్ర ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం... కనీసం రూ. 7,000 కోట్ల (846 మిలియన్‌ డాలర్లు) అత్యవసర అప్పు కోసం వొడాఫోన్ ఐడియా తాజాగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే, కొత్త అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ఇష్టపడడం లేదు.


ఇండస్‌ టవర్స్‌కు (Indus Towers) వొడాఫోన్‌ ఐడియా రూ. 7,500 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఈ కంపెనీకి చెందిన టవర్స్‌ను వినియోగించున్నందుకు ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాల్లో ఎక్కువ భాగాన్ని, ఇండస్ టవర్స్‌కు ఉన్న బకాయిల్లో కొంత మొత్తాన్ని భర్తీ చేయడానికి వొడాఫోన్‌ ఉపయోగిస్తుంది. 


2023 జనవరి నుంచి విడతల వారీగా 100 శాతం బకాయిలు చెల్లిస్తామని ఈ టెలికాం కంపెనీ, టవర్ కంపెనీకి మాట ఇచ్చింది. మాట నిలబెట్టుకోలేక బకాయిలను క్లియర్ చేయడంలో టెలికాం కంపెనీ విఫలమైతే, టవర్ సైట్‌లకు యాక్సెస్‌ను కోల్పోవాల్సి వస్తుందని వొడాఫోన్‌ ఐడియాను ఇండస్ టవర్స్ గతంలోనే హెచ్చరించింది.