Upcoming Smartphones: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతినెలా వందల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. భారతదేశంలో కూడా ప్రతి నెలా అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అవుతున్నాయి. భారతీయ వినియోగదారులు కూడా కొత్త ఫోన్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారతదేశం అతిపెద్ద ఫోన్ మార్కెట్. కాబట్టి ప్రతి నెలా అనేక కొత్త ఫోన్‌లు ఇక్కడ లాంచ్ అవుతున్నాయి.


2024లో ఇప్పటికే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ నుంచి రియల్‌మీ జీటీ 7 ప్రో వరకు అనేక కూల్ ఫోన్లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. అయితే ఈ సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు. ఈ సంవత్సరం ముగియడానికి ఇంకా ఒక నెల సమయం ఉంది. 2024 చివరి నెలలో అంటే డిసెంబర్‌లో చాలా కంపెనీలు తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. డిసెంబర్ నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతున్న  కొన్ని టాప్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఐకూ 13 (iQOO 13)
ఐకూ 13 స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 3వ తేదీన భారతదేశంలో లాంచ్ కానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ అంటుటు బెంచ్ మార్కింగ్ స్కోర్ (స్మార్ట్ ఫోన్ పనితీరును కొలిచే టెస్ట్) మూడు మిలియన్ల కంటే ఎక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.


ఐకూ 13 ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను పొందవచ్చు. అంటే దీనికి నీరు, దుమ్ము వల్ల ప్రమాదం ఉండబోదన్న మాట. చైనాలో ఐకూ 13 స్మార్ట్ ఫోన్ 6.82 అంగుళాల 2కే ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వచ్చింది. ఇది 144 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది. 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్921 కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఇందులో ఉండనున్నాయి.


వివో ఎక్స్200 సిరీస్ (Vivo X200 Series)
వివో ఎక్స్200 సిరీస్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందనే దానిపై ఇంకా ఎటువంటి ప్రకటన లేదు. అయితే కంపెనీ దీనికి సంబంధించిన ప్రమోషన్‌ను పూర్తి స్వింగ్‌లో ప్రారంభించింది. దీని కారణంగా ఈ ఫోన్ లాంచ్ త్వరలో జరుగుతుందని అనుకోవచ్చు. వివో ఎక్స్200లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఉండవచ్చు. అలాగే 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 సెన్సార్ ఉండనుంది. వివో ఎక్స్200 ప్రోలో మాత్రం 200 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్‌పీ9 సెన్సార్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.



Also Read: ఇండియాలో అమెజాన్ మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ - స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు!


వన్‌ప్లస్ 13 (OnePlus 13)
వన్‌ప్లస్ నంబర్ సిరీస్ ఫోన్లు సాధారణంగా జనవరిలో లాంచ్ అవుతాయి. కానీ ఈసారి కొన్ని ఫోన్‌లు ముందుగానే లాంచ్ అవుతున్నాయి. కాబట్టి OnePlus 13 డిసెంబర్‌లోనే భారతదేశానికి కూడా రావచ్చు. ఇది 6.82 అంగుళాల 2కే ప్లస్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100W ఛార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంటుంది. దీని కెమెరా సెటప్‌లో సోనీ ఎల్‌వైటీ 808 ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండవచ్చు.


టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ 2, ఫాంటమ్ వీ ఫ్లిప్ 2 (Tecno Phantom V Fold 2 and Phantom V Flip 2)
టెక్నో ఈ రెండు ఫోన్‌లను వచ్చే నెలలో భారతదేశంలో లాంచ్ చేయవచ్చు. ఫాంటమ్ వీ ఫ్లిప్ 2 6.9 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్, 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంటుంది. అదే సమయంలో ఫాంటమ్ వీ ఫోల్డ్ 2... 7.85 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది.


పోకో ఎఫ్7 (Poco F7)
పోకో ఎఫ్7 భారతదేశంలో డిసెంబర్‌లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దాని మోడల్ నంబర్ బీఐఎస్ వెబ్‌సైట్‌లో కనిపించింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.



Also Read: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?