WhatsApp Features: వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లకు మరిన్ని సౌకర్యాలు అందిస్తోంది. కానీ చాలా మంది కేవలం చాట్ చేయడం, కాల్స్ చేయడానికే దీన్ని ఉపయోగిస్తుంటాం. అయితే, ఈ యాప్‌లో ఇప్పటికే మీ గోప్యత (Privacy), సౌలభ్యం, చాటింగ్ అనుభవాన్ని మెరుగుపరిచే అనేక అధునాతన ఫీచర్లు వచ్చి చేరాయని గుర్తించారా. ఈ ఫీచర్లు ఏమిటో, వాటిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆటోమేటిక్ హై-క్వాలిటీ ఫోటో షేరింగ్సాధారణంగా చాలా మెసేజింగ్ యాప్‌లు మీరు పంపే ఫోటోలను కంప్రెస్ (Compress) చేస్తుంటాయి. కానీ వాట్సాప్‌లో మీరు ఇకపై ఫోటోలు, వీడియోలను ఎప్పుడూ HD క్వాలిటీలో పంపవచ్చు. ప్రతిసారీ HD ఐకాన్‌ను నొక్కి సెలక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా, మీరు దీన్ని డిఫాల్ట్‌గా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం, Settings > Storage and Data > Media Upload Quality లోకి వెళ్లి HD ని సెలక్ట్ చేసుకోవాలి. దీనివల్ల స్టోరేజ్ కొంచెం ఎక్కువగా వినియోగమైనా, ఫోటో క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంటుంది.
పాస్‌కీ (Passkey)తో అకౌంట్ మరింత సురక్షితం వాట్సాప్ ఇప్పుడు మీకు పాస్‌కీ లాగిన్ సపోర్ట్ ను అందిస్తోంది. ఇందులో మీ ముఖం (Face) లేదా వేలిముద్ర (Fingerprint) మాత్రమే మీ గుర్తింపు అవుతుంది. ఒకవేళ మీ ఫోన్ పోయినా లేదా ఎవరైనా మీ వాట్సాప్‌ను సెటప్ చేయడానికి ప్రయత్నించినా.. మీ బయోమెట్రిక్ ఐడీ లేకుండా యాప్ ఓపెన్ చేయలేరు. దీన్ని ఆన్ చేయడానికి Settings > Account > Passkeys లోకి వెళ్లండి. మీ చాట్ బ్యాకప్‌ను కూడా మరింత సురక్షితం చేయడానికి Chats > Chat Backup లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్ ను కూడా Activate చేసుకోవచ్చు.
ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ ఖాతాలుగతంలో 2 నంబర్లను ఉపయోగించాలంటే యాప్ క్లోన్ లేదా వాట్సాప్ బిజినెస్ (WhatsApp Business) వంటి అదనపు యాప్‌లు ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పుడు వాట్సాప్ మల్టీ-అకౌంట్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది. దీని కోసం, 3 చుక్కల మెనూ (Three-dot menu) > Settings లోకి వెళ్లి, మీ పేరు పక్కన కనిపించే '+' ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యాక, ఎటువంటి అదనపు యాప్ లేకుండా మీ రెండవ ఖాతా వెంటనే రెడీ అవుతుంది.
చాట్ లోపలే తక్షణ అనువాదం (Instant Translation)ఒక మెసేజ్‌ను మరో భాషలో చదవాలా? ఇకపై వేరే యాప్ తెరవాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. మీకు కావాల్సిన మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి, More ని ఎంచుకుని, ఆపై Translate పై ట్యాప్ చేయండి. ల్యాంగ్వేజ్ ప్యాక్‌లు డౌన్‌లోడ్ అయిన వెంటనే అనువాదం కనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే, మొత్తం చాట్ థ్రెడ్‌కు ఆటో-ట్రాన్స్‌లేషన్‌ను సైతం ఆన్ చేసుకోవచ్చు, దీనివల్ల విదేశీ భాషలో ఉన్న చాట్‌ను చదవడం చాలా సులభం అవుతుంది.
గ్రూప్ చాట్‌ల కోసం AI ఆధారిత స్మార్ట్ సమ్మరీ (Smart Summary)మీరు ఎక్కువ మెసేజ్‌లు ఉన్న గ్రూప్ చాట్‌ను మిస్ అయ్యారా? అయితే మెటా ఏఐ (Meta AI) అందించే కొత్త 'మెసేజ్ సమ్మరీస్' ఫీచర్ మీ కోసం ఆ మొత్తం చాట్‌లోని ముఖ్య విషయాలను చిన్న, స్పష్టమైన సారాంశం (Summary) గా తయారుచేసి ఇస్తుంది. మీరు చదవని మెసేజ్‌లు (Unread messages) ఉన్నప్పుడు మీకు 'Summarise Privately' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ మీ ఫోన్‌లో ప్రాసెస్ అవుతుంది. అంటే మీ చాట్ వివరాలు మెటా వరకు వెళ్లవు. అయితే, ప్రస్తుతం ఈ ఫీచర్ కొన్ని పరిమిత భాషల్లో, ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరు యూజర్లకు ఇవ్వనున్నట్లు సంస్థ తెలిపింది.