టెక్నో పోవా నియో 5జీ మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. గతేడాది మనదేశంలో లాంచ్ అయిన టెక్నో పోవా నియో 4జీకి 5జీ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. రూట్‌మై గెలాక్సీ కథనం ప్రకారం ఈ ఫోన్ ఐఎంఈఐ డేటాబేస్‌లో కనిపించింది.


ఎల్ఈ6జే అనే మోడల్ నంబర్‌తో టెక్నో పోవా నియో 5జీ ఈ లిస్టింగ్‌లో కనిపించింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ ఫోన్ జులై లేదా ఆగస్టులో మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీని ఫీచర్లను బట్టి ధర రూ.14 వేలలోపే ఉండే అవకాశం ఉంది.


టెక్నో పోవా నియో 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.9 అంగుళాల భారీ డిస్‌ప్లే ఉండనుందని తెలుస్తోంది. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. సెల్ఫీ కెమెరా కోసం ముందువైపు పంచ్ హోల్ నాచ్‌ను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉండనుంది. ర్యామ్‌ను మరో 5 జీబీ వరకు పెంచుకోవచ్చు. పాంథర్ గేమ్ ఇంజిన్ 2.0 ఆప్టిమైజేషన్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది.


ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఎలక్ట్రిక్ బ్లూ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!