Sanchar Saathi App: ఈ మధ్య కాలంలో కేంద్రం జారీ చేసిన ఓ ఉత్తర్వు వివాదాల కేంద్రంగా మారింది. ఇకపై వచ్చే ప్రతి మొబైల్‌లో సంచార్ సాంథీ యాప్ తప్పనిసరిగా ఉండాలంటూ ప్రకటించడాన్ని అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలపై ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రతి ఫోన్‌లో ప్రీ ఇన్‌స్టాల్ చేసి ఉండాలని, దాన్ని వినియోగదారులు తొలగించడానికి లేకుండా చేయాలని కూడా పేర్కొంది. అన్ని వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాల తర్వాత ఆ ఉత్తర్వుల్లో మార్పులు చేర్పులు చేసింది. వినియోగదారులకు ఇష్టం ఉంటే కంటిన్యూ చేయవచ్చని లేకుంటే తొలగించకోవచ్చని పేర్కొంది.  

Continues below advertisement

వెనక్కి తగ్గిన కేంద్రం

టెలికమ్యూనికేషన్స్‌ సైబర్ సెక్యూరిటీ అమెండ్‌మెంట్‌ రూల్స్‌, 2025 ప్రకారం నవంబర్‌ 28న టెలికామ్‌ డిపార్ట్మెంట్‌ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలతో గోప్యత, పర్యవేక్షణ, సమస్యలపై తీవ్ర ఆదోళన వ్యక్తమైంది. వినియోగదారులకు ఈ యాప్‌ను ఉపయోగించాలా వద్దా అనే నిర్ణయించుకునే అవకాశఁ లేకుండా పోయింది. ఎందుకంటే ఇది తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసి వస్తుంది. అంతే కాకుండా వారు డిలీట్ చేసే వీలు లేకుండా ఉంది. కానీ అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం, ఐటీ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేయడంతో సంచార్‌ సాథీ యాప్‌ విషయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కాస్త ఊరట కల్పించినప్పటికీ ప్రజల వినియోగించే గాడ్జెట్స్‌పై ప్రభుత్వం నిఘా పెట్టిందనే ఆందోళన ఇంకా తొలగిపోలేదు. 

ఇష్టం లేకుంటే డిలీట్ చేయవచ్చు

ప్రస్తుతం నెలకొన్న గడబిడపై టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలక ప్రకటన చేశారు. యాప్‌ను తొలగించాలనుకుంటే తొలగిచుకోవచ్చు, ఇది తప్పనిసరికాదు అని తేల్చి చెప్పారు. దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ మోసాలు, సైబర్ మోసాల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ యాప్‌ తీసుకొచ్చామన్నారు. చాలా మందికి ఈ యాప్ గురించి తెలియదని అందుకే ప్రతి సెల్‌ఫోన్‌లో కచ్చింతగా ఇన్‌స్టాల్ చేయాలనే ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఉత్తర్వులు సవరించామన్నారు. యాప్‌ను ఉపయోగించుకోకూడదు అనుకుంటే తొలగించుకోవచ్చని, లేదనుకుంటే అలా ఇన్‌యాక్టివ్‌గా వదిలివేయవచ్చని వెల్లడించారు. ఇందులో వినియోగదారునికి పూర్తి స్వేచ్ఛ ఉందని అన్నారు.   

Continues below advertisement

యాప్ ఉద్దేశం మంచిదే కానీ... 

పెరిగిపోతున్న డిజిటల్ మోసాలు, సెల్‌ చోరీలు, వాటి ఆధారంగా జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ఈ సంచార్ సాథీ యాప్ తీసుకొచ్చింది కేంద్రం. చోరీకి గురైన మొబైల్‌ ఫోన్‌లను వెతికి పట్టుకోవడానికి, నకిలీ లేదా క్లోనింగ్ చేసిన ఐఎంఈఐలను గుర్తించడానికి, వాటిని బ్లాక్ చేయడానికి, మోసపూరిత కాల్స్‌ను కట్టడి చేయడానికి, మెసేజ్‌లను రిపోర్ట్ చేయడానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. యాప్ తీసుకొచ్చిన ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, కచ్చితంగా ప్రతి ఫోన్‌లో డిలీట్ చేసేందుకు అవకాశం లేని విధంగా ఇన్‌స్టాల్ చేయాలనే ఆదేశాలు మాత్రం వివాదానికి కారణమయ్యాయి. 

అన్నింటీని యాక్సెస్ చేయగలదు

సంచార్‌ సాథీ యాప్‌ వినియోగదారుడికి ఫోన్‌లో ఎలాంటి డేటాను యాక్సెస్ చేస్తుందో ఒకసారి పరిశీలిస్తే... మొదటిది ఫోన్ కాల్స్‌ను మేనేజ్ చేయడం. అఁటే ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని నెంబర్‌లను గుర్తించడానికి పర్మిషన్ అడుగుతుంది. టెలికామ్‌ డిపార్ట్‌మెంట్‌కి అటోమేటిక్‌ మెసేజ్‌ పంపడం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు. యాప్‌లోని సేవలను ఉపయోగించి మోసపూరిత కాల్స్‌ను ఎస్‌ఎంఎస్‌లను రిపోర్ట్‌ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది. చోరీ అయిన లేదా పోయిన మొబైల్‌ ఫోన్‌లను రిపోర్ట్ చేసేటప్పుడు లేదా మోసపూరిత సందేశాల ఇమేజ్‌లను అప్లోడ్ చేయానికి కూడా పర్మిషన్ అడుగుతుంది. ఐఎంఈఐ బార్‌కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా దాని ప్రామాణికతను తనిఖీ చేయడానికి కూడా కెమెరా పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆండ్రాయిట్‌లో యూజర్‌ సమ్మతి లేకుండానే ఫోన్ నెంబర్‌తో ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. మొదట్లో చెప్పుకున్నట్టు మీరు ఫోన్‌లో సిమ్ వేసిన వెంటనే దీని నుంచి టెలికాం డిపార్ట్మెంట్‌కు సందేశం వెళ్లిపోతుంది. దీని ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోతుంది. ఆపిల్‌ ఫోన్‌లో మాత్రం ఈ ఆటోమెటిక్‌గా మెసేజ్ పంపేందుకు వీలు లేదు. మిగతా వాటి యాక్సెస్‌ మాత్రం కచ్చితంగా అడుగుతుంది. 

ఇప్పుడు అందుబాటులో ఉన్న యాప్‌ ఫోటోలు, వీడియోలు, కాల్‌ లాగ్స్‌, ఫోన్‌ నెంబర్‌లు, కాల్ యాక్టివ్‌గా ఉందా లేదా అనే వివరాలను గుర్తించే ఫీచర్స్ ఉన్నాయి. వాటిని యాక్సెస్ చేయగలదు. అందుకే దీనిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పర్శనల్‌ సమాచారం అడిగినప్పుడు డేటాను రక్షించడానికి తగిన భద్రతా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ వినియోగదారుల హక్కుల గురించి మాత్రం స్పష్టమైన ప్రకటన లేదు. ఇవన్నీ ఈ యాప్‌లో ప్రధాన లోపాలుగా చెబుతున్నారు. ఇవేవీ జీవోలో కానీ, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కానీ చెప్పలేదు. యాప్ రిజిస్ట్రేషన్ టైంలో మాత్రం ఫోన్ నెంబర్లు, ఫోటోలు, కాల్‌, మేసేజ్‌లు, సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే దీనిపై సర్వత్రా అనుమానాలు నెలకొన్నాయి.