ప్రస్తుతం మనదేశంలో ఫోల్డబుల్ మార్కెట్లో రెండు కంపెనీలే లీడింగ్‌లో ఉన్నాయి. అవే శాంసంగ్, మోటొరోలా. అయితే వీటిలో శాంసంగే ముందంజలో ఉంది. ఫోల్డ్, ఫ్లిప్ రెండు విభాగాల్లోనూ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తూ ఈ మార్కెట్లో దూసుకుపోతుంది.


ఇప్పుడు వినిపిస్తున్న కథనాల ప్రకారం శాంసంగ్ బడ్జెట్ ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ ఏ ఫోల్డ్ అనే సిరీస్ పేరుతో ఈ ఫోన్లు లాంచ్ కానున్నట్లు సమాచారం. గెలాక్సీ ఏ సిరీస్‌లో శాంసంగ్ ఇప్పటికే పలు స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తుంది. ఇవన్నీ మిడ్ రేంజ్‌లో ప్రీమియం డిజైన్‌తో లాంచ్ అయినవే.


ఇదే ఫార్ములా ఫోల్డబుల్ ఫోన్లకు కూడా పనిచేస్తుంది. ఫోల్డబుల్ ఫోన్లను ఎక్కువ మందికి చేరువ చేయడం కోసం శాంసంగ్ గెలాక్సీ ఏ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌లో బడ్జెట్ ఫోల్డబుల్ ఫోన్లను కంపెనీ రూపొందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


శాంసంగ్ గెలాక్సీ ఎస్-సిరీస్ కంటే ఏ-సిరీస్ ఫోన్లే ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. అందుకే శాంసంగ్ బడ్జెట్ ఫోల్డబుల్ ఫోన్లకు ఏ-సిరీస్ పేర్లే పెడుతుందేమో మరి. శాంసంగ్ బడ్జెట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ధర ఒక మిలియన్ వాన్‌లుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.61,000) ఉండే అవకాశం ఉంది. పేపర్ మీద ఈ ధర ఎక్కువగా కనిపిస్తున్నా... గెలాక్సీ ఫోల్డ్ సిరీస్‌తో పోలిస్తే ఇది దాదాపు సగం ధర.


ధర మాత్రమే కాకుండా దీనికి సంబంధించిన కీలక వివరాలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఏ-ఫోల్డ్ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 తరహాలో అల్ట్రా థిన్ గ్లాస్ లేయర్ ఉండనుంది. ఫోల్డబుల్ టెక్నాలజీకి మరో చవకైన ఆల్టర్నేటివ్‌ను శాంసంగ్ తీసుకురానుంది. ఈ ఫోన్లు 2024లో లాంచ్ కానున్నాయని సమాచారం.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!