రియల్‌మీ 9 సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా 10 సిరీస్ త్వరలో లాంచ్ కానుంది. కంపెనీ వీటి తయారీని ఇప్పటికే ప్రారంభించింది. ఈ సిరీస్‌లో మొదట లాంచ్ కానున్న ఫోన్ రియల్‌మీ 10 ప్రో ప్లస్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ ఇప్పటికే చాలా సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించింది. మనదేశంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికేషన్ వెబ్ సైట్లో కూడా రియల్‌మీ 10 ప్రో ప్లస్ సర్టిఫికేషన్ పొందింది. అంటే త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుందన్న మాట. రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌తో రియల్‌మీ 10 సిరీస్ పోటీ పడనుంది.
RMX3686 అనే మోడల్ నంబర్‌తో బీఐఎస్ వెబ్‌సైట్లో ఒక ఫోన్ కనిపించింది. అది రియల్‌మీ 10 ప్రో ప్లస్ అయ్యే అవకాశం ఉంది. రియల‌్‌మీ 9 సిరీస్‌లో ప్రో ప్లస్ మోడల్ ఉంది కాబట్టి 10 సిరీస్‌లో కూడా ఈ మోడల్ ఉండే అవకాశం ఉంది. సర్టిఫికేషన్లు కూడా పొందింది కాబట్టి 2022లోనే ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
బీఐఎస్ వెబ్‌సైట్‌తో పాటు థాయ్‌ల్యాండ్ ఎన్బీటీసీ, ఈఈసీ, టీకేడీఎన్ సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కూడా ఈ ఫోన్ కనిపించింది. అయితే చైనా వెబ్‌సైట్లో మాత్రం కనిపించలేదు. దీని స్పెసిఫికేషన్లు మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యలో ఈ ఫోన్ ధర ఉండే అవకాశం ఉంది. అమోఎల్ఈడీ డిస్‌ప్లే, ఎక్కువ రిఫ్రెష్ రేట్, హై క్వాలిటీ కెమెరాలు ఇందులో అందించనున్నారు.
రియల్‌మీ 9 ప్రో స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ అయింది.ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించారు. హైఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.20,999గా నిర్ణయించారు.
రియల్‌మీ 9 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ ప్యానెల్‌ను అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే,.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.
8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 185 గ్రాములుగా ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?