ఒప్పో ఎఫ్21 ప్రో స్మార్ట్ ఫోన్ బంగ్లాదేశ్‌లో లాంచ్ అయింది. కంపెనీ ఎఫ్-సిరీస్ లైనప్‌లో ఇది లేటెస్ట్ మోడల్. ఇందులో స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా మరో 5 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు. ఇందులో 6.43 ఇంచుల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 64 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.
ఒప్పో ఎఫ్21 ప్రో ధర
దీని ధరను 27,990 బంగ్లాదేశ్ టాకాలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.24,640) నిర్ణయించారు. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. కాస్మిక్ బ్లాక్, సన్‌సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో రేపు (ఏప్రిల్ 12వ తేదీ) లాంచ్ కానుంది.
ఒప్పో ఎఫ్21 ప్రో స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా... టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. 8 జీబీ ర్యామ్ ఇందులో అందించారు. ర్యామ్‌ను మరో 5 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మైక్రోస్కోప్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, ఆప్టికల్ సెన్సార్, యాక్సెలరో మీటర్, గ్రావిటీ సెన్సార్, గైరోస్కోప్, పీడోమీటర్, జియోమ్యాగ్నటిక్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.75 సెంటీమీటర్లు కాగా... బరువు 175 గ్రాములుగా ఉంది.
Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?
Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?