Oneplus:వన్‌ప్లస్‌, భారత్ మొబైల్ మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగింది. ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రచారంతో వన్‌ప్లస్‌ మొబైల్ వాడుతున్న వినియోగదారుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అమెరికా, యూరప్‌ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత భారత్ నుంచి కూడా వెళ్లిపోతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇకపై వన్‌ప్లస్‌ ఫోన్‌లు భారత్ మార్కెట్ కనిపించవా అనే చర్చ జరుగుతోంది. దీనిపై కంపెనీ స్పందించింది. జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాము భారత్ నుంచి వెళ్లిపోవడం లేదని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు అందిస్తున్నట్టుగానే భవిష్యత్‌లో కూడా తమ సేవలు భారతీయ వినియోగదారులకు అందిస్తామని పేర్కొన్నారు. దీనంతటికీ బ్లూమ్‌బర్గ్ ప్రచురించిన ఆర్టికల్‌ సంచలనంగా మారింది. 

Continues below advertisement

వన్‌ప్లస్‌పై బ్లూమ్‌బర్గ్ ఏమని రాసింది?

వన్‌ప్లస్ మాతృసంస్థ అయిన ఒప్పో కీలకమైన నిర్ణయం తీసుకుందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. మొత్తం వ్యాపారాన్ని రీస్ట్రక్చర్ చేయడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్స్‌ నుంచి వన్‌ప్లస్ తప్పుకుంటున్నట్టు ఆ రిపోర్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతానికి అమెరికా, యూరప్ మార్కెట్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. భవిష్యత్‌లో అంటే 2027 నాటికి భారత్ మార్కెట్ నుంచి కూడా తప్పుకోబోతున్నట్టు పేర్కొంది. భారత్ లాంటి భారీ మార్కెట్‌ నుంచి వన్‌ప్లస్ లాంటి ఫేమస్‌ మొబైల్ డిజైన్ చేసే సంస్థ తప్పుకోబోతోందనే ప్రచారం సంచలనంగా మారింది. 

ఒప్పో ఎందుకీ నిర్ణయం తీసుకుంది?

వన్‌ప్లస్‌ను ఎప్పుడో ఒప్పో టేకోవర్ చేసింది. అయితే దీని వల్ల ఒప్పోకు వచ్చిన ప్రయోజనం లేదు. బ్రాండింగ్ పెద్దగా జరగడం లేదు. అందుకే ఒప్పో తన బ్రాండ్‌ను విస్తరించేందుకు స్కెచ్ వేస్తోంది. ప్రీమియం బ్రాండ్‌లను ప్రమోట్ చేయాలని చూస్తోంది. అందుకే వన్‌ప్లస్‌ను కేవలం చైనాకు పరిమితం చేయాలని ఒప్పో ప్లాన్. అందులో భాగంగా వివిధ దేశాల్లో ఉన్న వన్‌ప్లస్‌ అవుట్‌లెట్‌లను మూసివేస్తూ వస్తున్నారు. 

Continues below advertisement

ఓఎస్‌ను ఎందుకు మార్చింది?

గ్లోబల్ బ్రాండ్‌గా మరింత శక్తిమంతంగా ఎదిగేందుకు ఉన్న దారులన్నింటీని వాడుకుంటోంది. అందులో భాగంగా ఇప్పటికే ఒప్పో ఫోన్‌లకు వాడుతున్న ఆక్సిజన్ ఓఎస్‌ను తొలగించింది. కలర్ ఓఎస్‌ను తీసుకొచ్చింది. 

విడిభాగాల ధరల్లో కూడా వ్యత్యాసం 

ఆపిల్ ఫోన్లకు పోటీగా వన్‌ప్లస్‌ను తీసుకొచ్చారు. అయితే దాని విడిభాగాలు చాలా ఖరీదైనవి. అందుకే మధ్యస్థంగా ఉండే నార్డ్‌ ఫోన్‌లు ప్రవేశపెట్టింది. వీటి విడిభాగాలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అయితే పెరిగిన ముడిసరకు ధరలతో వన్‌ప్లస్‌ మొబైల్స్ రిపేర్ చేయడం, అమ్మకాలను కంటిన్యూచేయడం సంస్థకు భారంగా మారతోంది. ఇప్పుడు డిస్‌కంటిన్యూ చేయడానికి ఇది కూడా ఒక కారణంగా మార్కెట్‌విశ్లేషకులు చెబుతున్నారు. 

పెరిగిపోతున్న పోటీ 

మొదట్లో ఆపిల్‌తో మాత్రమే వన‌ప్లస్‌కు పోటీ ఉండేది. కానీ సామ్‌సంగ్‌, వివో, ఐక్యూ లాంటి సంస్థలు కూడా ప్రీమియం సెగ్మెంట్‌లోకి వచ్చేశాయి. అదిరిపోయే ఫీచర్స్‌తో ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు మొబైల్స్ రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా సామ్‌సంగ్‌ నుంచి పోటీ తీవ్రంగా ఉంటోంది. ప్రస్తుత పోటీని తట్టుకొని ప్రజలను మెప్పించడం కష్టంగా మారుతోంది. ఎన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే చైనా వెలుపల మార్కెట్‌ను వన్‌ప్లస్ పెంచుకోలేకపోతోంది. 

అంతర్జాతీయ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి

వన్‌ప్లస్‌పై ఇప్పటికే ఆపిల్ ఒక కేసు ఫైల్ చేసింది. ఈ విషయంపై ఇంకా వాదనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడటం, ఆ కేసును ఎదుర్కొని ముందుకు వెళ్లడ ఇబ్బంది మారుతోంది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా వన్‌ప్లస్‌కు చికాకు పెట్టిస్తున్నాయి. వచ్చిన కొత్త రూల్స్ కారణంగా 15కుపైగా ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ను విడుదల ఆలస్యమవుతోంది. పెరిగిపోతున్న సాంకేతికత కారణంగా ఆ మోడల్స్ అవుడేటెడ్ అవుతున్నాయి. 

యూరప్, అమెరికాలో మారుతున్న పరిస్థితులను బట్టి ఒప్పో కంపెనీ అక్కడి నుంచి వన్‌ప్లస్‌ను వెనక్కి తీసుకోవాలని చూస్తోంది. కానీ భారత్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదని కంపెనీ తెలిపింది. కొత్త ఫోన్ల అమ్మకాల సంగతి పక్కన పెడితే మిగతా సపోర్ట్ సిస్టమ్‌ కచ్చితంగా భారత్‌ నుంచి వెళ్లేది లేదని తేల్చి చెప్పింది.