నథింగ్ ఫోన్ 1 ప్రీ-ఆర్డర్లు మనదేశంలో ప్రారంభం అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన బ్యానర్‌ను కూడా చూడవచ్చు. దీనికి సంబంధించిన ఇన్వైట్-ఓన్లీ వెయిట్ లిస్ట్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అంటే ప్రైవేట్ కమ్యూనిటీ మెంబర్లు ఇన్విటేషన్ కోడ్ ద్వారా దీన్ని ముందే ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పబ్లిక్ వెయిట్ లిస్ట్ కూడా ప్రారంభం కానుంది.


ఈ స్మార్ట్ ఫోన్ జులై 12వ తేదీన లాంచ్ కానుంది. గతవారం నథింగ్ ఇన్విటేషన్ కోడ్ సిస్టంను ప్రారంభించింది. ప్రైవేట్ కమ్యూనిటీలో ఉన్న కొద్ది మంది వినియోగదారులకు మాత్రమే ఈ ప్రీ-ఆర్డర్ పాస్‌ను అందించారు.రూ.2,000 రీఫండబుల్ ప్రైస్ చెల్లించి ఈ ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేయవచ్చు.


ప్రైవేట్ కమ్యూనిటీలోని సభ్యులకు ఈ-మెయిల్ ద్వారా కోడ్‌ను పంపించారు. ఈ ఫోన్ ధర ఇంకా తెలియరాలేదు. నథింగ్ లాంచ్ చేయనున్న రెండో ఉత్పత్తి ఇదే. గత సంవత్సరం నథింగ్ ఇయర్ (1) పేరిట ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను కంపెనీ లాంచ్ చేసింది.


ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండనుంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వైర్‌లెస్, రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించనున్నారు. 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా ఇందులో ఉండనున్నాయి.


వన్‌ప్లస్ సహవ్యవస్థాపకుడు కార్ల్ పెయ్ అక్కడి నుంచి బయటకు వచ్చిన అనంతరం నథింగ్ కంపెనీని స్థాపించాడు. వన్‌ప్లస్, ఒప్పో భాగస్వామ్యం అనంతరం కార్ల్ పెయ్ బయటకు రావడం, ఈ నథింగ్ బ్రాండ్‌ను స్థాపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో నథింగ్‌ను వన్‌ప్లస్‌కు ప్రత్యామ్నాయంగా కూడా కొందరు టెక్ నిపుణులు చూస్తున్నారు. వారి అంచనాలను నథింగ్ ఫోన్ (1) అందుకుంటుందో లేదో తెలియాలంటే మరో రెండు వారాలు ఆగితే చాలు.


Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?


Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!