Nothing Phone 1: నథింగ్ ఫోన్ 1 భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా జులై 12న లాంఛ్ కానుంది. నథింగ్ ఫోన్ 1 ఇతర స్మార్ట్‌ఫోన్ల తరహాలో కాకుండా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండనుందని టెక్ ప్రపంచ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ యూనిక్ మొబైల్ డిజైన్‌ను వివరిస్తూ ఓ వీడియో వెలుగులోకి రావడంతో ఈ స్మార్ట్‌పోన్ ట్రెండీ లుక్, హాట్ పీచర్లు బయటకు వచ్చాయి. ఇతర స్మార్ట్‌ఫోన్లకు భిన్నంగా దీని బ్యాక్ ప్యానెల్ డిజైన్ వైవిధ్యంగా ఉంది.
నథింగ్ ఫోన్ 1 విశేషాలు లీక్
ఇప్పటికే నథింగ్ ఫోన్ 1 కోసం టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. యాపిల్ తర్వాత ఆ స్థాయి ఫోన్‌గా పేరు తెచ్చుకున్న వన్ ప్లస్ మాజీ సీఈవో కార్ల్ పీ దీన్ని రూపొందించారు.ఈ ఫోన్‌కు కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. నథింగ్ ఫోన్ 1 డిజైన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు బయటికి వచ్చాయి. నథింగ్ 1 బ్యాక్ ప్యానెల్ పూర్తిగా భిన్నంగా ఉంటూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. మిగిలిన స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉండేలా, కొత్త ట్రెండ్ సృష్టించేలా దీన్ని నథింగ్ తయారు చేసింది.
ఎల్‌ఈడీ లైట్ల సెటప్ ప్రత్యేక ఆకర్షణ
నథింగ్ ఫోన్ 1 బ్యాక్ ప్యానెల్‌కు లైట్ సెటప్ ఉంది. దీనిలో ఉండే గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనే ఫీచర్ మొబైల్ వెనుక ఉన్న లైట్ సెటప్‌ను కంట్రోల్ చేసేందుకు ఉపయోపడుతుంది. భిన్నమైన రింగ్ టోన్స్ వచ్చే సమయంలో వినూత్నంగా లైట్స్ బ్లింక్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఫోన్ సౌండ్‌ను బట్టి లైట్స్ వెలిగేలా సెట్ చేసుకునే ఫీచర్ కూడా యూజర్లను ఆకట్టుకుంటుంది. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు కూడా అలెర్ట్ చేసేలా ఈ లైట్స్ ఉపకరిస్తాయి. ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందో కూడా ఈ లైట్స్ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది.
చార్జింగ్ ఇండికేటర్ కూడా ప్రత్యేకం
మొబైల్ చార్జింగ్ స్టేటస్ ఇండికేటర్‌గానూ నథింగ్ ఫోన్ 1 వెనుక ఉన్న లైట్స్ పని చేస్తాయి. చార్జింగ్ పెట్టగానే లైట్ సెటప్‌లో సన్నని గీత వెలుగుతుంది. ఇది బ్యాటరీ లెవెల్‌ను తెలుపుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో మనం చూడని విధంగా నథింగ్ 1 బాక్సీ డిజైన్‌తో కస్టమర్ల ముందుకొస్తోంది. ఐఫోన్ 12 తరహాలో నథింగ్ పోన్ 1 వర్టికల్లీ ప్లేస్‌డ్ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టంతో రానుంది. ఈ లైటింగ్ ఎఫెక్ట్ కోసం ఫోన్‌లో 900 వరకూ ఎల్‌ఈడీ లైట్లను పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఇతర ఫోన్ల ధరే ఉండే అవకాశం
ప్రత్యేకంగా ఉండబోతున్న ఈ నథింగ్ ఫోన్ విలువ.. మరీ ప్రత్యేకంగా ఉండే చాన్స్ లేదు. ఇతర ఫోన్ల మాదిరిగానే అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇదంతా ప్రాథమికంగా తెలిసిన సమాచారం మాత్రమే. అసలు ఆ ఫోన్ స్పెక్స్ అన్నీ బయటకు వస్తే ఫోన్ గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉంది.