జియో ఫోన్ 5జీ ఇటీవలే గీక్ బెంచ్ వెబ్‌సైట్లో కనిపించింది. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అయితే దీనికి సంబంధించిన లాంచ్ తేదీ ఇంకా తెలియరాలేదు. దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇప్పటికే లీకయ్యాయి. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను కూడా అందించనున్నారు.


ఈ స్మార్ట్ ఫోన్ "Jio LS1654QB5" అనే మోడల్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ లిస్టింగ్ ద్వారా ప్రాసెసర్, ర్యామ్, ఆపరేటింగ్ సిస్టం వివరాలు కూడా లీకయ్యాయి. హోలీ అనే కోడ్ నేమ్ ఉన్న చిప్ సెట్ ఇందులో ఉండనుంది. ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది.


ఈ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్ గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 549 పాయింట్లను, మల్టీ కోర్ టెస్టులో 1661 పాయింట్లను సాధించింది. ఆండ్రాయిడ్ ఆధారిత జియో ప్రగతి ఆపరేటింగ్ సిస్టంపై ఇది పని చేయనుంది. దీంతో పాటు ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్ ఉండనుందని తెలుస్తోంది.


దీని ధర మనదేశంలో రూ.8 వేల నుంచి రూ.12 వేల మధ్యలో ఉండనుందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ ఫోన్ వేర్వేరు ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, స్క్రీన్ సైజుల్లో మార్కెట్లోకి రానుంది. హోల్ పంచ్ తరహా కటౌట్‌ను ఇందులో అందించనున్నారు. రూ.8 వేలలోపే 5జీ ఫోన్ అంటే ఈ ఫోన్ జనాల్లోకి బాగా వెళ్లిపోయే అవకాశం ఉంది.


జియో 5G స్మార్ట్ ఫోన్  హెచ్‌డీ+ రిజల్యూషన్‌ స్క్రీన్‌తో వచ్చే అవకాశం ఉంది. 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు కొన్ని జియో యాప్ లకు  మాత్రమే సపోర్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో రానుంది, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. జియో 5G  ఫోన్ USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌ ను కలిగి ఉంటుందట. 


గతంలో జియో నుంచి వచ్చిన ఫోన్ మాదిరిగానే ఇందులో ఫీచర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. గూగుల్ అసిస్టెంట్, రీడ్ అలౌడ్ టెక్ట్స్, గూగుల్ లెన్స్, గూగుల్ ట్రాన్స్ లేట్ ఉండనున్నాయి. 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా ఉండనున్నాయని తెలుస్తోంది. ముందు భాగంలో సెల్పీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా అమర్చినట్లు సమాచారం.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?